-కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమష్టి కార్యాచరణకు దిశానిర్దేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధత, విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ ముఖ్య నాయకులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రుడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల సన్నద్ధత, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, వార్డుల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతి వార్డులో పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో పనిచేయాలని దేవినేని ఉమా దిశానిర్దేశం చేశారు.
