-రాష్ట్రంలో మైనింగ్ రంగంలో ఉన్న అపార అవకాశాలపై చర్చ
-ఆస్ట్రేలియాలోని గనులు, పరీక్షా కేంద్రాలు, సందర్శించాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆహ్వానం
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ – ఆస్ట్రేలియా మధ్య మైనింగ్ వ్యాపారాన్ని విస్తరించేలా ప్రత్యేక కార్యాచరణకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న CII భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, IAS ఆధ్వర్యంలో Ms. Silai Zaki – Consul general of Austrailia, Sri Abhijith nair – Policy research Analyst, Ms. Janaki Sreeram-Policy research Analyst సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – ఆస్ట్రేలియా మధ్య క్రిటికల్ మినరల్స్ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, బీచ్ సాండ్ మినరల్ ప్రాసెసింగ్ రంగాల్లోని అత్యాధునిక సాంకేతికతను మరియు నైపుణ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆస్ట్రేలియా క్యాన్సులేట్ ప్రతినిధులు మంత్రుల బృందాన్ని ఆహ్వానించారు.
ఖనిజనీషణ, ప్రాసెసింగ్, సెపరేషన్, శుద్ధి చేయడం మరియు పర్యావరణ అనుకూల మైనింగ్‌లో ఆస్ట్రేలియా ప్రపంచ స్థాయి అగ్రగామిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు నెల్లూరు తీర ప్రాంతాలలో బీచ్-శాండ్, మోనజైట్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. భారతదేశపు “రేర్ ఎర్త్ కారిడార్”లో ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రంగా అవతరించే అపారమైన వనరులున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో వేలం వేయనున్న మినరల్ బ్లాక్‌లను విశ్లేషించడానికి మరియు పరీక్షించడానికి ఆస్ట్రేలియా సాంకేతిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. మైనింగ్ నుంచి రేర్ ఎర్త్ మాగ్నెట్ మరియు కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు విలువ ఆధారిత సహకారానికి ఆస్ట్రేలియా సిద్ధంగా ఉందని ఆస్ట్రేలియా క్యాన్సులేట్ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే ఆస్ట్రేలియాలో పర్యటించి వ్యాపార అభివృద్ధికి ఇరు ప్రభుత్వాల మధ్య సమన్వయానికి కృషి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.
