జాతీయస్థాయిలో నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దిన కమిషనర్ కి ఏఐటియుసి శుభాకాంక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరాన్ని జాతీయస్థాయిలో 3వ క్లీన్ సిటీగా నిలిపి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదగా అవార్డు అందుకున్న మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఐఎఎస్ కి విజయవాడ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ AITUC ప్రధాన కార్యదర్శి బుద్దె రాజా, అధ్యక్షులు ఎస్వి ఎస్ చలం, మినిస్ట్రీరియల్ & ఆల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ గురువారం ఆయన చాంబర్ లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుధ్యంలోనూ, పచ్చదనంలోనూ నగరం అభివృద్ధి చెందేందుకు కమిషనర్ చేసిన కృషి విశేషమైనదని అన్నారు. నగరం క్లీన్ అండ్ గ్రీన్ సిటీ గా అభివృద్ధి చెందేందుకు కృషిచేసిన అధికారులకు ముఖ్యంగా పారిశుద్ధ్య, పార్కు, ఇంజనీరింగ్ కార్మికులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అధికారులు కార్మికులు అందరూ సమిష్టిగా పనిచేయడం వల్లనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో నగరం మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ జనరల్ రవీంద్ర గారిని కూడా యూనియన్ నాయకులు కలిసి దుశాల్వాతో గౌరవించారు.
కార్యక్రమంలో యూనియన్ నాయకులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.