గొల్లపూడి అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి : మాజీ మంత్రి దేవినేని ఉమా

-సర్పంచ్ అభ్యర్థి జయంత్ సాయికి దేవినేని ఉమా శుభాకాంక్షలు.. 20 వార్డుల్లో కూటమి జెండా ఎగరాలి

గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ సర్పంచ్ పదవికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొమ్మసాని సుబ్బారావు గారి కుమారుడు బొమ్మసాని జయంత్ సాయి, 20 వార్డులకు పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులు, స్థానిక నాయకులు నేడు గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి బొమ్మసాని జయంత్ సాయిని దేవినేని ఉమా దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే 20 వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. గొల్లపూడి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి, రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, గ్రామాభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉండే నాయకత్వాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత అభ్యర్థులపై ఉందన్నారు. ఎన్నికల్లో వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గొల్లపూడి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థితో పాటు 20 వార్డుల కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని దేవినేని ఉమా పిలుపునిచ్చారు.