-థీమ్ పార్కులు, పబ్లిక్ టాయిలెట్లు, జంక్షన్ల అభివృద్ధిపై కమిషనర్ మయూర్ అశోక్ సమీక్ష
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
నవ గుంటూరు అభివృద్ధిలో భాగంగా నగరంలో చేపట్టనున్న థీమ్ పార్కులు, నైబర్‌హుడ్ పార్కులు, పబ్లిక్ టాయిలెట్లు, ఎవెన్యూ ప్లాంటేషన్, జంక్షన్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు.
శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నగరంలో ఐదు ప్రాంతాల్లో థీమ్ పార్కులు, 21 ప్రాంతాల్లో నైబర్‌హుడ్ పార్కులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. వీటిలో పచ్చదనం, వాకింగ్ ట్రాక్‌లు, బెంచీలు, పిల్లల ఆట స్థలాలు ఏర్పాటు చేయాలన్నారు.
14 రోడ్లలో చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా డివైడర్లపై మొక్కల నాటే పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని, ఇప్పటికే ఉన్న మొక్కలను క్రమం తప్పకుండా ట్రిమ్మింగ్ చేయాలని సూచించారు.
అలాగే జనసంచారం అధికంగా ఉండే 28 ప్రాంతాల్లో ఆధునిక పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని, పురుషులు, మహిళలకు వేర్వేరు సౌకర్యాలతో పాటు దివ్యాంగులకు అనుకూలమైన డిజైన్, నీటి సరఫరా, హ్యాండ్‌వాష్, విద్యుత్, వెంటిలేషన్, మురుగునీటి నిర్వహణ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
నగరంలోని 15 జంక్షన్ల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, స్థానిక ఏఈలు క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు చేపట్టాలని సూచించారు. అన్ని పనులను ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాలు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
సమావేశంలో ఎస్ఈ జి. వెంకటేశ్వరరావు, డీసీపీ సూరజ్ కుమార్, ఈఈ వేణుగోపాల్, ఏడీహెచ్ శాంతి, ఏఈలు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు.
