గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్ వినియోగ నియంత్రణకు సమగ్ర ప్రణాళిక : ఏపీపీసీబీ ఛైర్మన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గోదావరి పుష్కరాల సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, వినియోగించిన ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి రీసైక్లింగ్ చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఏపీపీసీబీ ఛైర్మన్ డా. పి. కృష్ణయ్య సూచించారు. గురువారం విజయవాడలోని ఏపీపీసీబీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రముఖ బేవరేజ్ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత ప్యాకేజింగ్‌ను ప్రోత్సహించాలని, అవసరమైన ప్రాంతాల్లో వాటర్ డిస్పెన్సర్లు, తాగునీటి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. వినియోగించిన బాటిళ్లను సేకరించి, వేరు చేసి, అధీకృత సంస్థల ద్వారా రీసైక్లింగ్ చేయించే పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అలాగే పుష్కరాల సమయంలో విక్రయించిన, ఉచితంగా పంపిణీ చేసిన బాటిళ్ల సంఖ్య, తిరిగి సేకరించిన బాటిళ్లు, రీసైక్లింగ్‌కు పంపిన వ్యర్థాల వివరాలతో సమగ్ర ఆడిట్ నిర్వహించాలని సూచించారు.

ఈ సమావేశంలో రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు, హిందుస్థాన్ కోకా-కోలా, రిలయన్స్, బిస్లరీ ఇంటర్నేషనల్, ఆర్టోస్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పుష్కరాల కోసం చేపట్టనున్న కార్యక్రమాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలను 15 రోజుల్లోగా సమర్పించాలని ఛైర్మన్ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేసి గోదావరి పుష్కరాలను పర్యావరణహితంగా నిర్వహించాలని, నది పరిసరాల పరిశుభ్రతను కాపాడుతూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించాలని ఆయన పిలుపునిచ్చారు.