-జిల్లాలో మాతృ, శిశు మరణాల రేటును సున్నాకు తీసుకురావడమే లక్ష్యం
-అధిక ప్రమాద గర్భిణులను ముందుగానే గుర్తించి ప్రత్యేక వైద్య పర్యవేక్షణ అందించాలి
-సురక్షిత ప్రసవాలు, శిశు సంరక్షణ, పోషకాహారం, టీకాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
-మాతృ, శిశు మరణాల కేసులను సమగ్రంగా విశ్లేషించి, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో మాతృ, శిశు మరణాలను పూర్తిస్థాయిలో నివారించడమే లక్ష్యంగా వైద్యారోగ్య శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ప్రతి శిశు, మాతృ మరణం సంబంధిత కుటుంబానికి తీరని లోటని, ఇటువంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి మరణానికి గల కారణాలను లోతుగా విశ్లేషించి, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
విజయవాడ కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరం నందు గురువారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన మాతృ, శిశు మరణాల జిల్లా స్థాయి కమిటీ సమీక్ష సమావేశంలో ఈ ఏడాది ఏప్రిల్లో రెండు, మే నెలలో ఒకటి, జూన్ నెలలో ఒకటి చొప్పున నమోదైన మొత్తం నాలుగు శిశు మరణాలు, అలాగే ఆగస్టులో ఒకటి, సెప్టెంబర్లో రెండు చొప్పున నమోదైన మొత్తం మూడు మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా కేసులను పరిశీలించి, ప్రతి మరణానికి దారితీసిన వైద్యపరమైన, క్షేత్రస్థాయి కారణాలపై వైద్యాధికారులు, సంబంధిత ఆరోగ్య సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమగ్రంగా చర్చించారు. మరణాల విశ్లేషణలో భాగంగా గర్భిణులకు అందించిన వైద్య సేవలు, ప్రసవ సమయంలో తీసుకున్న జాగ్రత్తలు, ప్రసవానంతర సంరక్షణ, శిశువుల ఆరోగ్య పరిస్థితి, పోషకాహారం, టీకాల అమలు, అత్యవసర వైద్య సేవలు, రిఫరల్ వ్యవస్థ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షకులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలతో కేసుల వారీగా సమీక్షించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ, మాతృ, శిశు మరణాల నివారణకు ముందస్తు గుర్తింపు, నిరంతర పర్యవేక్షణ, సకాలంలో వైద్య చికిత్స అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా అధిక ప్రమాద గర్భిణులను ముందుగానే గుర్తించి, వారికి అవసరమైన ప్రత్యేక వైద్య పర్యవేక్షణ అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, అవసరమైన వైద్య పరీక్షలు, మందులు, పౌష్టికాహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రసవ సమయానికి ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులను మెరుగైన వైద్య సేవలు అందించే పెద్దాసుపత్రులకు తరలించేందుకు అవసరమైన రవాణా సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. అదేవిధంగా అవసరమైన రక్త నిల్వలు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణులకు సమయానుకూల వైద్య పరీక్షలు నిర్వహించడం, సురక్షిత ప్రసవాలను నిర్ధారించడం, జననం అనంతరం శిశువులకు తగిన సంరక్షణ అందించడం, పోషకాహారంపై దృష్టి సారించడం, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయించడం వంటి అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు. మాతృ, శిశు మరణాల నివారణ అనేది వైద్యారోగ్య శాఖకే పరిమితమైన బాధ్యత కాదని, సంబంధిత శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి కేసులో గుర్తించిన లోపాలను సరిదిద్దడంతో పాటు, సంబంధిత ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ. శ్రవణ్ బాబు మాట్లాడుతూ, శిశు ఆరోగ్యం, తల్లుల ఆరోగ్య సంరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవల నాణ్యతను పెంపొందించడం, గర్భిణులు మరియు శిశువులకు నిరంతర వైద్య పర్యవేక్షణ అందించడం ద్వారా మాతృ, శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఇందుకోసం వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఓ.మాధవి లత మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, శిశువులను సరైన సమయంలో మెరుగైన వైద్య సేవలు అందించే ఆసుపత్రులకు తరలించేందుకు రిఫరల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉన్నత స్థాయి ఆసుపత్రుల మధ్య సమన్వయం మెరుగుపరచడం ద్వారా సకాలంలో వైద్య సేవలు అందించవచ్చని పేర్కొన్నారు.
జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎం.శరత్ బాబు మాట్లాడుతూ, శిశువుల ఆరోగ్య పరిరక్షణలో టీకాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి శిశువుకు నిర్ణీత వయస్సులో పూర్తి టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, టీకాలు వేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ జె.ఇందుమతి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఓ.మాధవి లత, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎం. శరత్ బాబు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, సీడీపీఓలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
