-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ
-పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.
-స్ట్రాంగ్ రూముల భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదు – కిటికీలను ఇటుకలతో మూసివేయాలని ఆదేశం..
-ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త:
మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ సంబంధిత అధికారులను ఆదేశించారు.
తిరువూరు మున్సిపల్ పరిధిలోని పలు పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను గురువారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయి ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. తొలుత తిరువూరు స్థానిక జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను కలెక్టర్ పరిశీలించారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాలను సులభంగా గుర్తించే విధంగా ప్రతి బూత్ వద్ద స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. తాగునీరు, విద్యుత్, దివ్యాంగులకు ర్యాంపుల వంటి కనీస మౌలిక వసతుల్లో ఎక్కడా లోపాలు తలెత్తకుండా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.
అనంతరం తిరువూరు శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూముల భద్రత అత్యంత కీలకమని, కిటికీలను తాత్కాలికంగా చెక్కలతో కాకుండా పూర్తిగా ఇటుకలు, సిమెంట్ గోడలతో మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే సిబ్బందికి, రాజకీయ పార్టీల ఏజెంట్లకు, ప్రజలకు ఎలాంటి గందరగోళం లేకుండా వేర్వేరు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి విభాగం వద్ద ఎవరికి కేటాయించిన మార్గమో తెలిపేలా భారీ సైన్ బోర్డులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, పోలింగ్ సిబ్బందికి విధివిధానాలపై పూర్తిస్థాయి సమగ్ర శిక్షణ ఇవ్వాలని ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు తావులేకుండా కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని హెచ్చరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, నిర్దేశిత గడువులోగా ఎన్నికల ఏర్పాట్లన్నీ పూర్తి చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి, ప్రజాస్వామ్య పండుగలాంటి ఈ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా తిరువూరు ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ.కుమార్, మున్సిపల్ కమిషనర్ మనోజ్ఞ, తహసిల్దార్ డి.చంద్రమౌళి, ఎంపీడీవో సిహెచ్ రవిబాబు, తిరువూరు ఎస్.ఐ శాతకర్ణి, సర్వే శాఖ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
