ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు

-బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్న నాయకులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలతో విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ విజయోత్సవాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ మాట్లాడుతూ, ప్రజలు మరోసారి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు అద్భుత విజయాన్ని అందించారని, ఇప్పటివరకు 123 ఎంపీటీసీ స్థానాలు, 15 జెడ్పీటీసీ స్థానాల్లో పార్టీ విజయం సాధించిందని వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, ఆంధ్రప్రదేశ్‌లోనూ అమరావతి నుంచి పోలవరం వరకు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు అభివృద్ధికి మద్దతుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గన్నవరం జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని షేక్ బాజీ కోరారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు గుమిగూడిన ఘటనపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఇన్‌ఛార్జి ఉప్పలపాటి శ్రీనివాస్ రాజు, మువ్వల వెంకట సుబ్బయ్య, బొడ్డు నాగలక్ష్మి, ప్రవీణ్ రంకా తదితరులు పాల్గొన్నారు.