బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనుకోవడం సిగ్గుచేటు

Gurumurthy

-నామినేషన్ల అడ్డగింతపై ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలి : తిరుపతి ఎంపీ గురుమూర్తి
-ఎంపీ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనుకోవడం సిగ్గుచేటని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడం అర్హులైన అభ్యర్యులందరికి రాజ్యాంగం కల్పించిన హక్కు. అలాంటి హక్కును బెదిరింపులతో కాలరాయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆయన అన్నారు. వెంకటగిరి నియోజకవర్గం కలువాయిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకొని బెదిరింపులకి గురి చేసిన సంఘటనల గురించి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఈ నెల 19న కలువాయిలో జరిగిన టీడీపీ నాయకుల సమావేశంలో వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకోవాలని, అవసరమైతే వారిపై దాడులు చేయాలని పిలుపునిచ్చిన అంశాన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు ఎంపీ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇలా పిలుపునివ్వడం అత్యంత తీవ్రమైన విషయమని, ఎన్నికల ప్రక్రియలో భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలను ఏమాత్రం ఉపేక్షించరాదని ఎంపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఎన్నికల్లో ప్రజల మద్దతు కోరాల్సిన రాజకీయ పార్టీలు, ప్రత్యర్థి అభ్యర్థులను భయపెట్టి పోటీ నుంచి తప్పించాలని ప్రయత్నించడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు ప్రజల తీర్పుతో నిర్ణయించబడాలి తప్ప, బెదిరింపులు, దౌర్జన్యాలు, భౌతిక దాడుల భయంతో కాదని హితవు పలికారు. ప్రతి అర్హుడైన అభ్యర్థి ఎలాంటి ఒత్తిడులు, అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసుకునేలా ఎన్నికల యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, అందుబాటులో ఉన్న వీడియో రికార్డులు, ఇతర ఆధారాలను భద్రపరిచి నిష్పక్షపాతంగా పరిశీలించాలని ఎంపీ ఎన్నికల సంఘాన్ని కోరారు. నామినేషన్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో తగిన పోలీసు భద్రత కల్పించాలని, బెదిరింపులు ఎదుర్కొంటున్న అభ్యర్థుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆరోపణలు విచారణలో నిర్ధారణ అయితే, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎంపీ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ తగు చర్యలు తీసుకోవలసినదిగా డీజీపీ, తిరుపతి జిల్లా కలెక్టర్ లను ఆదేశించిందని ఎంపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాజకీయాలకు అతీతంగా ప్రతి అభ్యర్థి నామినేషన్ హక్కును కాపాడటం ఎన్నికల సంఘం బాధ్యత. ప్రజాస్వామ్య ప్రక్రియను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను అరికట్టి, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని డా. మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు.