రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు – మూడో రోజు 545 సర్పంచ్, 2,666 వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు

-మొత్తం 3,211 నామినేషన్లు స్వీకరణ
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మూడో రోజు నవంబర్ 20 ప్రశాంతంగా కొనసాగింది. నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ డాక్టర్ జి. లక్ష్మీశ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మూడో రోజు ముగిసే సమయానికి జిల్లాలోని రెండో విడత ఎన్నికల పరిధిలో సర్పంచ్ పదవులకు 545 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 2,666 నామినేషన్లు దాఖలయ్యాయని, మొత్తం 3,211 నామినేషన్లు స్వీకరించినట్లు కలెక్టర్ వెల్లడించారు.

* చందర్లపాడు మండలం : సర్పంచ్ పదవులకు 60, వార్డు సభ్యుల పదవులకు 403 నామినేషన్లు దాఖలయ్యాయి.
* జగ్గయ్యపేట మండలం : సర్పంచ్ పదవులకు 72, వార్డు సభ్యుల పదవులకు 330 నామినేషన్లు దాఖలయ్యాయి.
* కంచికచర్ల మండలం : సర్పంచ్ పదవులకు 60, వార్డు సభ్యుల పదవులకు 325 నామినేషన్లు దాఖలయ్యాయి.
* నందిగామ మండలం : సర్పంచ్ పదవులకు 79, వార్డు సభ్యుల పదవులకు 448 నామినేషన్లు దాఖలయ్యాయి.
* పెనుగంచిప్రోలు మండలం : సర్పంచ్ పదవులకు 72, వార్డు సభ్యుల పదవులకు 362 నామినేషన్లు దాఖలయ్యాయి.
* వత్సవాయి మండలం : సర్పంచ్ పదవులకు 121, వార్డు సభ్యుల పదవులకు 531 నామినేషన్లు దాఖలయ్యాయి.
* వీరులపాడు మండలం : సర్పంచ్ పదవులకు 81, వార్డు సభ్యుల పదవులకు 267 నామినేషన్లు దాఖలయ్యాయి.

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద అభ్యర్థులకు అవసరమైన సహకారం అందిస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.