కొండపల్లి బొమ్మల పునరుజ్జీవనానికి నీతి ఆయోగ్ బాస‌ట‌

– ఆకాంక్షిత బ్లాకుల అభివృద్ధి కార్య‌క్ర‌మం కింద రూ. 20 లక్షల ప్రాజెక్టుకు ఆమోదం
– క‌ళ‌, క‌ళాకారుల సమ్మిళిత అభివృద్ధికి ఈ ప్రాజెక్టు గొప్ప ముంద‌డుగు
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కొండపల్లి సంప్రదాయ చెక్క బొమ్మల కళకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు, స్థానిక కళాకారుల జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం చేసిన కృషికి గుర్తింపు లభించింది. నీతి ఆయోగ్ ఆకాంక్షిత బ్లాకుల కార్య‌క్ర‌మం (ఏబీపీ) కింద కొండపల్లి బొమ్మల పునరుజ్జీవనం, ప్రోత్సాహానికి రూ. 20 లక్షల ప్రత్యేక ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. జిల్లా యంత్రాంగం సమర్పించిన ప్రతిపాదనకు శుక్ర‌వారం నిర్వహించిన 52వ సాధికార కమిటీ సమావేశంలో ఆమోదముద్ర పడింది. ఈ స‌మావేశానికి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌.. ఏబీపీ కోఆర్డినేట‌ర్లు శ్రీనివాస్‌, మోహ‌న్‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్ నుంచి వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యారు.
మొత్తం రూ. 20 లక్షల వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టును జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో ఏడాది కాలపరిమితితో అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి క‌ళాత్మ‌క బొమ్మల తయారీపై ఆధారపడిన 420 మంది స్థానిక కళాకారులకు ప్రయోజనం చేకూరనుంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయ కళను పరిరక్షించడంతో పాటు, కళాకారుల నైపుణ్యాలను ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ల‌క్ష్య‌మ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. ప్రాజెక్టులో భాగంగా సంప్రదాయ కళాకారులకు ఆధునిక తయారీ పద్ధతులు, నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ అందించనున్న‌ట్లు తెలిపారు. కొండపల్లి బొమ్మలకు ప్రత్యేక బ్రాండింగ్ కల్పించడం, పర్యావరణహిత ప్యాకేజింగ్ విధానాలను ప్రోత్సహించడం ద్వారా ఉత్పత్తుల నాణ్యత, ఆకర్షణను పెంపొందించడం జ‌రుగుతుంద‌ని.. కొండపల్లి బొమ్మలకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకువచ్చేందుకు డిజిటల్ మార్కెటింగ్ వేదికలను వినియోగించ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఆన్‌లైన్ విక్రయాలు, మెరుగైన మార్కెట్ అనుసంధానం ద్వారా కళాకారుల ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు, వారికి మెరుగైన ఆదాయ అవకాశాలు కల్పించడంపై దృష్టిసారించినున్న‌ట్లు తెలిపారు. నీతి ఆయోగ్ ఆకాంక్షిత బ్లాకుల అభివృద్ధి కార్యక్రమం లక్ష్యాలకు అనుగుణంగా స్థానికంగా ఉన్న సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించడం, కళాకారులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం, సమ్మిళిత అభివృద్ధిని సాధించడం దిశగా ఈ ప్రాజెక్టు ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు.