బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతుల పంపిణీ

-శ్రీ సత్యసాయి విద్యావిహార్‌లో ఘనంగా వ్యాసరచన పోటీ – 125 మంది విద్యార్థుల భాగస్వామ్యం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగర మేయర్ కొవెలమూడి లక్ష్మీ అపర్ణ ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ, గుంటూరు పట్టణ ఫ్యాన్సీ, స్టేషనరీ, జనరల్ మెడికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి విద్యావిహార్ జెడ్ పి కాంపౌండ్ పాఠశాలలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ పోటీలో పాఠశాలకు చెందిన సుమారు 125 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలో ప్రతిభ కనబరిచిన విజేతలకు మొదటి బహుమతిగా రూ.2,500, రెండవ బహుమతిగా రూ.2,000, మూడవ బహుమతిగా రూ.1,500 నగదు బహుమతులను అందజేశారు. అంతేకాకుండా, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్యాన్సీ అసోసియేషన్ సభ్యులు పాఠశాల విద్యార్థులందరికీ పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి విద్యావిహార్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ పి.ఎల్. నరసింహారావు, పాఠశాల ప్రిన్సిపాల్ సీతామహాలక్ష్మి, మాజీ కార్పొరేటర్ టీ. వరప్రసాద్ పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు జుజ్జూరు శేష ప్రభాకర్, రంగా వెంకట రామకృష్ణ, గెల్లా రమేష్ కుమార్, బచ్చు వెంకట సుబ్బయ్య, వేమూరి వెంకట కామేశ్వరరావు, రంగా చంద్రశేఖర్, చుండూరు దామోధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత, రచనా నైపుణ్యాలు, దేశభక్తి భావాలను పెంపొందించడంతో పాటు జాతీయ నాయకుల జీవిత చరిత్రలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.