అంతర్జాతీయ క్రీడా దౌత్యంలో రోయింగ్‌కు ప్రాధాన్యం : డా. తరుణ్ కాకాని

-ఏపీలో అంతర్జాతీయ స్థాయి రోయింగ్ అకాడమీలు ఏర్పాటు చేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
భారత ప్రభుత్వ ఉన్నతస్థాయి క్రీడా ప్రతినిధి బృందంలో రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఎఫ్ఐ)కు ప్రాతినిధ్యం లభించడం పట్ల స్కల్లింగ్ అండ్ రోయింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కుమార్ కాకాని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ అధికారిక మెమోరాండం ప్రకారం, ఆర్ఎఫ్ఐ అధ్యక్షుడు బాలాజీ మరాడప నవంబర్ 16 నుంచి 20 వరకు న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో పర్యటించే భారత క్రీడా ప్రతినిధి బృందంలో సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ పర్యటనలో హై-పెర్ఫార్మెన్స్ శిక్షణా కేంద్రాల సందర్శన, స్పోర్ట్స్ సైన్స్ పరిజ్ఞాన మార్పిడి, ద్వైపాక్షిక క్రీడా సహకార కార్యక్రమాలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా డాక్టర్ కాకాని మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ తీరప్రాంతం, కృష్ణా, గోదావరి వంటి నదులు, విస్తారమైన జలవనరులు ఉన్నందున రోయింగ్ క్రీడలో దేశంలోనే ప్రముఖ రాష్ట్రంగా ఎదిగే అవకాశాలున్నాయని తెలిపారు. విజయవాడ, అమరావతి, విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రోయింగ్ కోర్సులు, బోట్ హౌస్‌లు, శిక్షణా అకాడమీలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్)ను కోరారు. ఆధునిక రేసింగ్ బోట్లు, ఎర్గోమీటర్లు, సేఫ్టీ బోట్ల కొనుగోలుకు ప్రభుత్వం సహకరించాలని, యువతకు స్పోర్ట్స్ సైన్స్, పోషకాహారంతో కూడిన శిక్షణ అందించాలని సూచించారు. విద్యార్థులు, విద్యాసంస్థలు రోయింగ్‌ను ఒలింపిక్ క్రీడగా స్వీకరించాలని, ఇందులో ప్రతిభ కనబరిస్తే క్రీడా కెరీర్‌తో పాటు స్కాలర్‌షిప్ అవకాశాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర యువత రోయింగ్ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు తీసుకురావాలని డాక్టర్ కాకాని పిలుపునిచ్చారు.