-డిస్ట్రిక్ట్ గ్రీనింగ్ డెవలప్మెంట్ ఏజెన్సీ సొసైటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి
-మొక్కల పెంపకాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టి రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
-జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో పచ్చదనాన్ని మరింతగా పెంపొందించి, పర్యావరణ పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టే దిశగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అధికారులను ఆదేశించారు
జిల్లాలో గ్రీన్ కవర్ను విస్తరించడంతో పాటు మొక్కల పెంపకం, సంరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎన్టీఆర్ జిల్లాలో పచ్చదనం అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్న ‘డిస్ట్రిక్ట్ గ్రీనింగ్ డెవలప్మెంట్ ఏజెన్సీ’ సొసైటీ రిజిస్ట్రేషన్, భవిష్యత్ కార్యాచరణపై శుక్రవారం కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరం నందు జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధ్యక్షతన సంబంధిత శాఖల అధికారులతో కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏజెన్సీ సొసైటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ఏర్పాటుకు సంబంధించిన అవసరమైన చర్యలను సమన్వయంతో చేపట్టి, తదుపరి కార్యాచరణకు సిద్ధం కావాలని సూచించారు. జిల్లాలో పచ్చదనం విస్తీర్ణాన్ని పెంచేందుకు అన్ని సంబంధిత శాఖలు తమ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలను సమగ్రంగా రూపొందించుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. మొక్కల పెంపకానికి అనువైన ప్రాంతాలను గుర్తించడం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, నాటిన మొక్కల సంరక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. పచ్చదనం పెంపుదల అనేది కేవలం మొక్కలు నాటడంతోనే పరిమితం కాకుండా, వాటిని సంరక్షించి పెరిగేలా చూడటంతోనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ దిశగా అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. జిల్లాలో పచ్చదనం అభివృద్ధి కార్యక్రమాలను ఒక ఉద్యమంలా చేపట్టి, ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతూ, గ్రీనింగ్ కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖ తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆమె సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో డిస్ట్రిక్ట్ గ్రీనింగ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వి సుబ్రహ్మణ్యం రాఘవరావు, జిల్లా అటవీ శాఖ అధికారి జి.సతీష్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి.సుశీల, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పి.బాలాజీ కుమార్, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ డి.చంద్రశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి సీతామహాలక్ష్మి, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ.రాము, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవియన్. నాంచారారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల దేవి తదితరులు పాల్గొన్నారు.
