పోర్టులు, పెట్రో కెమికల్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు సహకరించండి

-అమరావతిలో ఖతార్ కార్యాలయం ఏర్పాటు చేయండి : సీఎం చంద్రబాబు
-ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తాం… త్వరలో అధికారిక బృందం పర్యటన : ఖతార్ రాయబారి మహ్మద్ హసన్ అల్ జబీర్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో భారత్‌లో ఖతార్ రాయబారి మహ్మద్ హసన్ జబీర్ అల్ జబీర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భవిష్యత్ ప్రాజెక్టులపై ఇరువురు చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, లాజిస్టిక్స్ పార్కులు, హాస్పిటాలిటీ రంగాల్లో అత్యుత్తమ ప్రాజెక్టులు ఉన్నాయని హసన్ అల్ జబీర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఎయిర్‌లైన్స్ రంగంలో ఖతార్ అత్యంత ప్రీమియం సేవలను అందిస్తోందని అన్న పేర్కొనగా… భారత్‌-ఖతార్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా కల్చర్‌తో పాటు ఫుడ్ ఇండస్ట్రీలోనూ అత్యుత్తమ నాణ్యతను అందిస్తున్నామని సీఎం వివరించారు. సాంకేతికతను వినియోగించుకుని రాష్ట్రంలో సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం తెలిపారు. భారత్‌లో పెట్టుబడులకు ఖతార్ ఆసక్తి చూపడం పట్ట ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల అభివృద్ధి పట్ల తమ విజన్‌ను అభినందించినందుకు రాయబారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని పోర్టులు, పెట్రో కెమికల్ ప్లాంట్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు ఖతార్ సహకారం అందించాలని కోరారు. ఖతార్ ఎయిర్‌వేస్ కనెక్టివిటీ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పారు. అమరావతిలో ఖతార్ దేశ కార్యాలయాన్ని ఏర్పాట చేసే అంశాన్ని పరిశీలించాలని రాయబారిని సీఎం చంద్రబాబు కోరారు.

ఖతార్ బృందం త్వరలో ఏపీ పర్యటన : హసన్ అల్ జబీర్

గతంలో భారత్‌లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఖతార్ ఆసక్తి ప్రకటించిందని రాయబారి మహ్మద్ హసన్ అల్ జబీర్ సీఎం చంద్రబాబుతో అన్నారు. ఏపీలో ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రాజక్టులు, భవిష్యత్ ప్రణాళికలపై మీర ఇచ్చిన ప్రజెంటేషన్లు అద్భుతంగా ఉన్నాయని సీఎం చంద్రబాబును ప్రశంసించారు. ఖతార్ నుంచి అధికారిక బృందం త్వరలోనే ఏపీలో పర్యటిస్తుందని హామీ ఇచ్చారు. ఇతర దేశాల్లో పనిచేస్తోన్న ఖతార్ కంపెనీలు ఏపీలోనూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఖతార్ ఎయిర్‌వేస్ కనెక్టివిటీని దేశంలోని వివిధ నగరాలకు పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఇప్పటికే ముంబైలో విజిట్ ఖతార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, అన్ని రాష్ట్రాల్లోనూ ఇటువాంటి కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని రాయబరి వివరించారు.