-అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి!
-జగన్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి
-చంద్రబాబు, పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించాలి
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
జనసేన అభిమానులు, కార్యకర్తలు నిర్వహించిన ఎక్స్ (ట్విట్టర్) స్పేస్ లైవ్ చర్చలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అత్యంత అసభ్యకరమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగినవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం ప్రజాస్వామ్య సంస్కృతికే అవమానమని ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తల నేపథ్యంలో ఆయనకు సంఘీభావం తెలిపే పేరుతో నిర్వహించిన ఎక్స్ స్పేస్ చర్చలో సుమారు 350 మంది పాల్గొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో కథనాలు వచ్చాయని తెలిపారు. అయితే ఈ చర్చలో కొందరు పాల్గొన్నవారు వైఎస్ జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అత్యంత నీచమైన భాషలో వ్యక్తిగత దూషణలకు దిగడం, మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం రాష్ట్ర సమాజం తలదించుకునే పరిస్థితిని కల్పించిందన్నారు.
రాజకీయంగా ఎవరినైనా విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, కానీ ఆ విమర్శలు వ్యక్తిగత దూషణలకు, కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి, మహిళల గౌరవాన్ని కించపరిచే స్థాయికి దిగజారకూడదని స్పష్టం చేశారు. ఒకరి రాజకీయ అభిప్రాయాలతో విభేదించినంత మాత్రాన వారి కుటుంబ సభ్యులను బహిరంగంగా అవమానించే హక్కు ఎవరికీ లేదన్నారు.
ఈ ఘటనపై పలుచోట్ల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం ఆందోళనకరమన్నారు. ఆడియో క్లిప్పుల ఆధారంగా చర్చలో పాల్గొన్నవారిని, అసభ్య వ్యాఖ్యలు చేసినవారిని, చర్చను నిర్వహించిన బాధ్యులను గుర్తించి విచారణ జరపాలని, వర్తించే చట్టాల కింద కేసులు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ఘటనపై మౌనం వీడి తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. తమ పార్టీకి చెందినవారైనా, అభిమానులైనా చట్టానికి అతీతులు కారని నిరూపించాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.
రాజకీయాల్లో విమర్శలు ఉండవచ్చు.. కానీ మహిళల గౌరవంపై దాడులు ఉండకూడదు. రాజకీయ ప్రత్యర్థులపై పోరాటం సిద్ధాంతాలతో జరగాలి తప్ప వారి కుటుంబ సభ్యులను కించపరిచే నీచ సంస్కృతితో కాదని ఈశ్వరయ్య హితవు పలికారు. సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హననానికి వేదికలుగా మార్చే ఇటువంటి ధోరణులకు అడ్డుకట్ట వేయాలని, బాధ్యులపై నిష్పక్షపాతంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
