పుస్తక పఠనంతో బాలల్లో మనోవికాసం, ఊహాశక్తి పెంపొందుతాయి

-కథల పుస్తకాలు పిల్లల్లో జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయి
-బాలల సంక్షేమ శాఖ డైరెక్టర్ వి.వసంత బాల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పిల్లలు కథల పుస్తకాలను చదవడం ద్వారా వారిలో మనోవికాసం కలుగుతుందని, ఊహాశక్తి పెంపొందడంతో పాటు జీవన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని బాలల సంక్షేమ శాఖ డైరెక్టర్ వి.వసంత బాల అన్నారు. కథల ద్వారా పొందే జ్ఞానం వారి భవిష్యత్తు జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. విజయవాడలోని కబేళా ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ బాలుర పరిశీలన గృహంలో (జువెనైల్ హోం) శుక్రవారం పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ‘లెర్న్ అండ్ హెల్ప్’ కార్యక్రమంలో భాగంగా సి.ఎ. ప్రసాద్, హరి వెంకట రమణ అందించిన సహకారంతో సుమారు 100 కథల పుస్తకాలను బాలుర పరిశీలన గృహానికి అందజేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వి.వసంత బాల మాట్లాడుతూ, పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడం ద్వారా వారిలో మంచి ఆలోచనా విధానం, సృజనాత్మకత, విలువలు అలవడతాయని తెలిపారు. కథల పుస్తకాలు పిల్లలకు వినోదాన్ని అందించడంతో పాటు జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కూడా పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ శరత్, అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.