-వాసవ్య మహిళా మండలి, అపోలో టైర్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గ్రామీణ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి, స్వయం ఉపాధి ద్వారా తమ కాళ్లపై తాము నిలబడాలనే లక్ష్యంతో వాసవ్య మహిళా మండలి, అపోలో టైర్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలోని రాచెర్ల, చిన్నపాండూరు గ్రామాల్లో మహిళలకు శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అపోలో టైర్స్ ఫౌండేషన్ సీఆర్ఎస్ కార్యకలాపాల ఇన్చార్జ్ జి. తారక పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. రాచెర్ల గ్రామ మహిళల కోరిక మేరకు ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, కుట్టుపనిలో మెళకువలు, వివిధ రకాల దుస్తుల కొలతలు, కటింగ్ తదితర అంశాల్లో మూడు నెలలపాటు శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు.
అనంతరం వాసవ్య మహిళా మండలి ప్రాజెక్ట్ మేనేజర్ కూన శివయ్య మాట్లాడుతూ, గత 57 సంవత్సరాలుగా మహిళలు, పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి ఆర్థిక అభివృద్ధికి తమ సంస్థ వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తోందని తెలిపారు. తిరుపతి జిల్లాలోని రాచెర్ల, చిన్నపాండూరు గ్రామాల్లో మహిళల అభ్యున్నతికి అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను రూపొందించినట్లు చెప్పారు. నవంబర్ నెలలో మరో మూడు శిక్షణా కార్యక్రమాలను వివిధ గ్రామాల్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మహిళలు అందుబాటులోకి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలకు, గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా గ్రామ మహిళలు మాట్లాడుతూ, ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. తమకు ఉపాధి నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం కల్పించిన వాసవ్య మహిళా మండలి, అపోలో టైర్స్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాచెర్ల, చిన్నపాండూరు గ్రామ పెద్దలు, వాసవ్య మహిళా మండలి ప్రతినిధులు కృష్ణ, భాగ్యలక్ష్మి, ప్రసాద్, రెండు గ్రామాలకు చెందిన మహిళలు, అపోలో టైర్స్ లైవ్లీహుడ్ ప్రాజెక్ట్ సిబ్బంది మురళి తదితరులు పాల్గొన్నారు.
