తుఫాను నేపథ్యంలో అప్రమత్తమైన ఎమ్మెల్యే. వెనిగండ్ల రాము..కూటమి నాయకత్వంతో గ్రూప్ కాల్ లో మాట్లాడి పరిస్థితి సమీక్ష

-స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ పట్టణంలో పర్యటన…
-రోడ్లపై కూలిన చెట్ల తొలగింపు పనుల పరిశీలన…పట్టణంలో 80% చెట్లు తొలగింపు పూర్తి: మున్సిపల్ యంత్రాంగం చురుగ్గా పనిచేస్తోంది
-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు, బైక్ లపై రావద్దు…ప్రజలకు సూచన
-పార్టీ నేతలు ప్రజలతో టచ్ లో ఉండాలి…
-విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం – సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచన….
-సాయంత్రం వరకు ఇదే పరిస్థితి – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త:
తుఫాను ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అప్రమత్తమయ్యారు.

నందివాడ రూరల్, గుడివాడ టౌన్, గుడ్లవల్లేరు మండలాల కూటమి నాయకత్వంతో టెలిఫోన్ గ్రూప్ కాల్ లో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీశారు. గ్రామాల్లో, పట్టణంలో సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం స్వయంగా కారును తానే డ్రైవ్ చేసుకుంటూ గుడివాడ పట్టణంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. రోడ్లపై కూలిన చెట్ల తొలగింపు పనులను స్వయంగా పరిశీలించారు.ఏలూరు రోడ్డు,బస్టాండ్, మార్కెట్ సెంటర్,జైన్ స్ట్రీట్,ఆర్డీఓ కార్యాలయ రోడ్డు,కొత్త పేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. లింగవరం సబ్స్టేషన్ వద్ద మెయిన్ లైన్ మరమత్తు పనులను పరిశీలించారు. ఎక్కడికక్కడ రోడ్లపై ఉన్న ప్రజలతో మాట్లాడుతూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, పార్టీ నేతలందరూ ప్రజలతో టచ్ లో ఉండాలని సూచించారు. చెట్లు కూలడం, విద్యుత్ సమస్యలు తప్ప ప్రస్తుతానికి ఇతర ఇబ్బందులు లేవని నాయకత్వం వివరించిందన్నారు.

అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని, భారీ గాలులు వీస్తున్న దృష్ట్యా ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేయవద్దని, మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, తప్పనిసరి అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలు,నాయకత్వానికి సూచించారు.

విద్యుత్ సమస్యల పునరుద్ధరణకు యంత్రాంగం నిరంతరం పనిచేస్తోందని, రోడ్లపై కూలిన చెట్లను వేగవంతంగా తొలగిస్తున్నట్లు తెలిపారు. గుడివాడ పట్టణంలో 80 శాతానికి పైగా కూలిన చెట్లను ఇప్పటికే యంత్రాంగం తొలగించిందని, గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వం కొంచెం అప్రమత్తంగా ఉండి, ఇబ్బందులు తలెత్తినప్పుడు ఉన్నతాధికార యంత్రాంగం దృష్టికి లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి లేదా కూటమి నాయకత్వం దృష్టికి తీసుకొస్తే తక్షణ సహాయం అందిస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.