-క్రీడాకారుడిని అభినందించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆసియా క్రీడల్లో అర్చరీ విభాగంలో స్వర్ణ, కాంస్య పతకాలు సాధించి ప్రతిభ చాటిన తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన తిరుమూరు గణేష్ మణిరత్నంను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అభినందించారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం అభినందనీయమని, ఆయన విజయాలు జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు.
బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఎన్నికల అబ్జర్వర్ ఎం. వరప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తో కలసి తిరుమూరు గణేష్ మణిరత్నంను జిల్లా కలెక్టర్. డా ఎస్. వెంకటేశ్వర్ అభినందించి, ఆయన క్రీడా విజయాలను ప్రశంసించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్చరీ వంటి ఏకాగ్రత, క్రమశిక్షణ, నిరంతర సాధనతో కూడిన క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం క్రీడాకారుడి పట్టుదలకు, ప్రతిభకు నిదర్శనమన్నారు. స్వర్ణ, కాంస్య పతకాల సాధనతో గణేష్ మణిరత్నం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. క్రీడల్లో విజయం సాధించాలంటే నిరంతర సాధనతో పాటు ఆత్మవిశ్వాసం, లక్ష్యంపై స్పష్టత, పట్టుదల అవసరమని, గణేష్ మణిరత్నం సాధించిన విజయాలు ఈ లక్షణాలకు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు.
భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. దేశానికి మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావడంతో పాటు, తిరుపతి జిల్లాకు కీర్తి ప్రతిష్ఠలను పెంపొందించాలని మనస్ఫూర్తిగా అభినందించారు.
క్రీడాకారులు తమ ప్రతిభను మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రోత్సాహం, అవసరమైన సహాయ సహకారాలు కీలకమని పేర్కొంటూ, గణేష్ మణిరత్నం క్రీడారంగంలో మరింత రాణించేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున కృషి చేస్తామన్నారు.
ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించవచ్చని తెలిపారు.
