విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం ఆంధ్ర లయోలా కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నవంబర్ 1, 2026న జరగనున్న పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ అనంతరం సామగ్రి స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఆంధ్ర లయోలా కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని సకాలంలో, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేరవేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేందుకు సిబ్బంది మధ్య సమన్వయం ఉండాలని, సామగ్రి పంపిణీ సమయంలో క్రమబద్ధమైన విధానాన్ని అనుసరించాలని సూచించారు.
పోలింగ్ పూర్తయిన అనంతరం ఎన్నికల సిబ్బంది నుంచి రిసెప్షన్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని తిరిగి స్వీకరించే ప్రక్రియను కూడా అంతే జాగ్రత్తగా నిర్వహించాలని కమిషనర్ స్పష్టం చేశారు. పోలింగ్ అనంతరం సామగ్రి స్వీకరణలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా అవసరమైన కౌంటర్లు, సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ నుంచి పోలింగ్ అనంతరం తిరిగి స్వీకరించే వరకు ప్రతి దశను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, పర్యవేక్షణ ఇంజనీర్లు చంద్రశేఖర్, దృశ్యంత్, జోనల్ కమిషనర్ కె. షమ్మీ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
