బ్యాలెట్ పేపర్ల వెరిఫికేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి: కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో నవంబర్ 1, 2026న విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించనున్న పోలింగ్‌కు సంబంధించి బ్యాలెట్ పేపర్ల వెరిఫికేషన్ ప్రక్రియను కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం గవర్నర్‌పేటలోని కందుకూరి కళ్యాణ మండపంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని మేయర్ మరియు 86 వార్డులకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను వార్డుల వారీగా, సంబంధిత రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తున్న తీరును ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు బ్యాలెట్ పేపర్ల వెరిఫికేషన్ అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి వార్డుకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను సంబంధిత రిటర్నింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తులు సరిగ్గా ముద్రించబడ్డాయా, గుర్తుల క్రమం, వివరాలు సంబంధిత వార్డుకు కేటాయించిన వివరాలకు అనుగుణంగా ఉన్నాయా అనే అంశాలను జాగ్రత్తగా తనిఖీ చేయాలని ఆదేశించారు.

బ్యాలెట్ పేపర్ల పరిశీలనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి అంశాన్ని నిశితంగా ధృవీకరించాలని, వార్డుల వారీగా కేటాయించిన ఎన్నికల గుర్తులు, అభ్యర్థుల వివరాలను సంబంధిత రికార్డులతో సరిపోల్చుకోవాలని సూచించారు. పోలింగ్‌కు ముందుగానే వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేసి, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కె. శకుంతల, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, సంబంధిత అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.