349 పీఎం శ్రీ పాఠశాలల ఉపాధ్యాయులకు 5 రోజుల ‘స్కూల్ బ్యాండ్’ శిక్షణ పూర్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా, అమరావతిలోని విట్ (VIT) విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 5 రోజుల ‘స్కూల్ బ్యాండ్’ శిక్షణా కార్యక్రమం శుక్రవారంతో విజయవంతంగా ముగిసింది. పీఎం శ్రీ పథకం కింద పాఠశాలలకు సరఫరా చేసిన ట్రంపెట్, బ్యాగ్‌పైప్, సైడ్ డ్రమ్, బాస్ డ్రమ్ తదితర 12 రకాల బ్యాండ్ వాయిద్య పరికరాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా 349 పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు (PETs), స్కౌట్ ఉపాధ్యాయులకు ఈ శిక్షణ అందించారు.
ఈ కార్యక్రమాల అమలును జిల్లా విద్యాశాఖాధికారులు, అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు నిరంతరం పర్యవేక్షిస్తారు. తద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ, బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందడంతో పాటు పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయి వేడుకలలో ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చే అవకాశం కలుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో సీమ్యాట్ (SIEMAT) లెక్చరర్లు ప్రసాద్, బి. సురేష్ కుమార్, కార్యక్రమ సమన్వయకర్త పుల్లట రమేష్ కుమార్, పుష్పాంజలి, ఏఏంవో అశోక్ తదితరులు పాల్గొన్నారు.