విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
“నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పిని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. మహిళల్లో సాధారణంగా కనిపించే ఎండోమెట్రియోసిస్ సమస్య గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం” అని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నాదెళ్ళ మౌనిక అన్నారు. వాసవ్య నర్సింగ్ హోమ్ లో డాక్టర్ సమరం అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె “ఎండోమెట్రియోసిస్” అనే అంశంపై విపులంగా ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో ఎండోమెట్రియోసిస్ సమస్య ప్రతి పదిమంది మహిళల్లో ఒకరికి ఉందన్నారు. గర్భాశయం లోపలి పొరను పోలిన కణజాలం గర్భాశయం వెలుపల, ముఖ్యంగా అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్స్, పెల్విస్ ప్రాంతంలోని ఇతర అవయవాలపై పెరగడాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారని వివరించారు. చాలామంది మహిళలు నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుమునొప్పి, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి రావడం సహజమేనని భావిస్తూ, దానిని భరిస్తూ ఉంటారని తెలిపారు. అయితే ప్రతి నెలసరి సమయంలో భరించలేనంత నొప్పి రావడం సాధారణం కాదని, అది ఎండోమెట్రియోసిస్ సమస్యకు సంకేతం కావచ్చని వివరించారు. ముఖ్యంగా నొప్పి కారణంగా రోజువారీ పనులు చేసుకోలేకపోవడం, పాఠశాలలు, కళాశాలలు లేదా ఉద్యోగాలకు వెళ్లలేకపోవడం, నిద్రకు ఆటంకం కలగడం వంటి లక్షణాలను తేలికగా తీసుకోకూడదని సూచించారు. ఈ వ్యాధి ఉన్న మహిళల్లో నెలసరి సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, నడుమునొప్పి, నెలసరి రాకముందు నుంచే ప్రారంభమయ్యే పొత్తికడుపు నొప్పి, నెలసరి సమయంలో అధిక రక్తస్రావం లేదా క్రమరహిత రక్తస్రావం, లైంగిక సంపర్క సమయంలో లేదా అనంతరం నొప్పి, నెలసరి రోజుల్లో మలవిసర్జన లేదా మూత్రవిసర్జన సమయంలో నొప్పి, నిరంతర అలసట, కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధిత ఇబ్బందులు, గర్భధారణలో ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. అయితే ఈ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఎండోమెట్రియోసిస్ ఉంటుందని చెప్పలేమని, కొంతమందిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే ఈ వ్యాధి ఉండవచ్చని తెలిపారు. ఎండోమెట్రియోసిస్ను గుర్తించడంలో ఆలస్యం జరిగితే దీర్ఘకాలిక నొప్పి, పెల్విస్ ప్రాంతంలో అతుకులు, అండాశయాలపై తిత్తులు వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నప్పటికీ సరైన వైద్య సలహా, చికిత్సతో చాలామంది మహిళలు గర్భం దాల్చగలరని స్పష్టం చేశారు. ఈ వ్యాధిని గుర్తించడానికి వైద్య పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పద్ధతులు ఉపయోగపడతాయని తెలిపారు. అవసరాన్ని బట్టి MRI వంటి పరీక్షలు కూడా చేయవచ్చని చెప్పారు. సాధారణ అల్ట్రాసౌండ్లో వ్యాధి కనిపించకపోయినా ఎండోమెట్రియోసిస్ను పూర్తిగా తోసిపుచ్చలేమని వివరించారు. నొప్పి నివారణ మందులు, హార్మోన్ ఆధారిత చికిత్సలు, అవసరమైన సందర్భాల్లో లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చని వివరించారు. మహిళలు తీవ్రమైన నెలసరి నొప్పి ఉన్నప్పుడు భరిస్తూ నిర్లక్ష్యం చేయకుండా కుటుంబ సభ్యులతో చర్చించి వైద్యునితో చికిత్స పొందడం ఎంతో అవసరం అన్నారు. శ్రీ డి.రవి కుమార్ వందన సమర్పణ చేసారు. సదస్సులో పాల్గొన్న పలువురు అనేక ప్రశ్నలడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు.
తీవ్రమైన నెలసరి నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు
