విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న కీలక నిర్ణయాలను ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపులకు ఎస్క్రో ఖాతా విధానాన్ని ప్రవేశపెట్టడం, పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాలు పారిశ్రామిక రంగానికి భరోసానిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు సకాలంలో అందేందుకు దోహదపడతాయని తెలిపారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రావడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సానుకూల పరిణామమని అన్నారు.
కియా, రెన్యూ, రిలయన్స్, గెయిల్ వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపడం శుభపరిణామమని పేర్కొన్నారు. శ్రీ సిటీ తరహాలో ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేయడానికి జపాన్ ఆసక్తి చూపడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. పెద్దఎత్తున పరిశ్రమలు రావడం వల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) అనుబంధ పరిశ్రమలు, వెండర్ డెవలప్మెంట్, సరఫరా గొలుసు అనుసంధానం వంటి రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.
పెట్టుబడుల ప్రతిపాదనలను వాస్తవ ప్రాజెక్టులుగా మార్చడమే ప్రస్తుతం ప్రభుత్వ ముందున్న ప్రధాన లక్ష్యమని భాస్కరరావు అన్నారు. ఇందుకు వేగవంతమైన అనుమతులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, నిర్ణీత కాలపరిమితిలో ప్రాజెక్టుల అమలు కీలకమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న పెట్టుబడిదారుల అనుకూల సంస్కరణలు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపునిస్తున్నాయని తెలిపారు. ఇదే సంస్కరణల వేగాన్ని కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన, సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి లక్ష్యాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఏపీ ఛాంబర్స్ కట్టుబడి ఉంటుందని భాస్కరరావు స్పష్టం చేశారు.
