‘మురసు’ తుపానుపై విద్యుత్‌ శాఖ అప్రమత్తం

-48 గంటల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణే లక్ష్యం
-విద్యుత్‌ లైన్లపై ప్రమాదకర చెట్లను వెంటనే తొలగించాలి
-అవసరం మేరకు తమిళనాడు నుంచి అదనపు సిబ్బంది, యంత్రాలు సిద్ధం
-1912 కాల్‌సెంటర్‌ 24 గంటలూ అందుబాటులో ఉండాలి
-మూడు డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లతో మంత్రి గొట్టిపాటి టెలికాన్ఫరెన్స్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
‘మురసు’ తుపాను నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా, ప్రాణ, ఆస్తి నష్టాలను సాధ్యమైనంత వరకు నివారించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని విద్యుత్‌ శాఖ అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని విద్యుత్‌ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. సోమవారం ఏపీసీపీడీసీఎల్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీలతో పాటు డిస్కంల ఉన్నతాధికారులు, డైరెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి తుపాను సన్నద్ధతపై సమీక్షించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడితే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ముందుగానే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సూచించారు. తుపాను ప్రభావం అధికంగా ఉండే జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని, డిస్కంల సీఎండీలు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యుత్‌ లైన్లపై ఉన్న ప్రమాదకర చెట్ల కొమ్మలను వెంటనే తొలగించి, గాలుల కారణంగా తీగలు తెగిపడటం, ఇతర ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అవసరమైన సామగ్రి ముందుగానే సిద్ధం
విద్యుత్‌ పునరుద్ధరణకు అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుళ్లు, ఇతర పరికరాలు, యంత్రాలను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన సంఖ్యలో సిబ్బందిని సిద్ధం చేసుకోవాలన్నారు. అవసరమైతే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి అదనపు సిబ్బంది, యంత్రాలను రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 48 గంటల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని గొట్టిపాటి ఆదేశించారు. ఒక ప్రాంతంలో మరమ్మతులు పూర్తయిన వెంటనే సిబ్బందిని మరో ప్రాంతానికి తరలిస్తూ పనులు వేగవంతం చేయాలన్నారు. విద్యుత్‌ శాఖతో పాటు రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

1912కు ఫిర్యాదు చేయాలి
తుపాను సమయంలో విద్యుత్‌ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు 1912 టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్‌ను 24 గంటలూ అందుబాటులో ఉంచాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ఈదురుగాలులకు విద్యుత్‌ తీగలు తెగిపడినా, స్తంభాలు కూలినా ప్రజలు వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులకు లేదా 1912కు సమాచారం అందించాలని సూచించారు. తెగిపడిన విద్యుత్‌ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని, వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ స్తంభాలు, చెట్ల కింద నిలబడకూడదని, బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రాణనష్టం జరగకుండా సహకరించాలని కోరారు.

అర్నబ్‌ తుపాను పునరుద్ధరణపైనా ఆరా
టెలికాన్ఫరెన్స్‌ సందర్భంగా గతంలో అర్నబ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న విద్యుత్‌ పునరుద్ధరణ పనుల పురోగతిని కూడా మంత్రి గొట్టిపాటి సమీక్షించారు. మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి విద్యుత్‌ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఎక్కడా సిబ్బంది, సామగ్రి కొరత లేకుండా చూసుకోవాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని గొట్టిపాటి రవికుమార్‌ స్పష్టం చేశారు.