పి.బి. సిద్ధార్థలో బ్రిక్స్ సేవ్ ఎనర్జీ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పర్యావరణ సంక్షోభం భవిష్యత్తులో తీవ్ర సమస్య కాబోతోందని, సహజవనరులను పరిమితంగానే వాడుకోవాలని, మన అలవాట్లు, జీవనశైలి మార్చుకోవడం ద్వారా శక్తి (ఎనర్జీ) ఆదా జరగాలని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ డా. పి. కృష్ణయ్య అన్నారు. పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భౌతికశాస్త్ర విభాగం, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా సోమవారం కళాశాల వెబినార్ హాలులో సేవ్ ఎనర్జీ పేరుతో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రిక్స్ (బిల్డింగ్ సస్టైనబుల్  అండ్ గ్రీనర్ ఫ్యూచర్  టుగెదర్) సేవ్ ఎనర్జీ వారోత్సవాల్లో భాగంగా రెండోరోజు  కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక విప్లవం తరవాత సహజ వనరుల వినియోగంలో విచ్చలవిడితనం పెరిగిందని, భూగర్భజలాలు అడుగంటాయని, 33 శాతం ఉండాల్సిన అడవులు దేశంలో 23 శాతమే ఉన్నాయన్నారు.
ప్రిన్సిపాల్ డా. మేకా రమేశ్ మాట్లాడుతూ శక్తి ఆదాలో భాగంగా వాడకంలో లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అన్‌ప్లగ్ చేయాలన్నారు.  ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ 11 దేశాల బ్రిక్స్ కూటమి ప్రపంచ సమస్యలపై ఒక్కటయ్యాయని, అందులో సేవ్ ఎనర్జీ, ఎన్విరాన్ మెంట్ ఒకటన్నారు. సేవ్ ఎనర్జీ, సేవ్ వాటర్, రెడ్యూస్  వేస్ట్ అంశాలపై పర్యావరణ స్పృహను ప్రజల్లో కలిగిస్తున్నామన్నారు. జూనియర్ రీసెర్చ్ స్కాలర్ ఫాతిమా మాట్లాడుతూ వరితో పోల్చితే ఐదొంతుల నీటిని తక్కువగా గ్రహించే మిల్లెట్స్ వారానికి ఒకసారి రైస్ కి ప్రత్యామ్నాయ ఆహారంగా తీసుకోవాలన్నారు. ఏఐ సాంకేతికతను తక్కువగా వాడడం ద్వారా నీటి అధిక వినియోగం తగ్గించాలని, జీవనశైలి మార్చుకోవడం ద్వారా ఫుడ్ వేస్టేజ్ తగ్గించాలన్నారు. యువతరం మొక్కలు  పెంచాలని, పునర్వినియోగం అలవాటు చేసుకోవాలన్నారు. ఫిజిక్స్ విభాగాధిపతి డా. టి. శ్రీనివాసకృష్ణ, సీనియర్ అధ్యాపకులు డా. జె.పాండురంగారావు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల చేత పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు.