చెప్పాం… చేస్తున్నాం… అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం!

-గ్రామాల అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి: దేవినేని ఉమా
-రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి విస్తృత ఎన్నికల ప్రచారం

రాజమండ్రి రూరల్, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం మురుమండ గ్రామంలో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి దేవినేని ఉమా పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలిసి ప్రభుత్వ పాలనలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు మళ్లీ ఊపిరి పోస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ‘చెప్పాం… చేస్తున్నాం…’ అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం నిరంతరాయంగా కొనసాగాలంటే స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం అవసరమని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని దేవినేని ఉమా ప్రజలను కోరారు.