-బిక్కవోలు మండలంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే నల్లమిల్లితో కలిసి మాజీ మంత్రి విస్తృత ఎన్నికల ప్రచారం
-అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే స్థానిక ఎన్నికల్లో కూటమికి ప్రజలు అండగా నిలవాలి
అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తోందన్నారు. రైతులకు భరోసా, మహిళలకు ఆర్థిక చేయూత, యువతకు ఉపాధి అవకాశాలు, పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. గ్రామాల్లో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తున్న ప్రభుత్వానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే స్థానిక సంస్థల్లో కూడా అభివృద్ధికి కట్టుబడి పనిచేసే కూటమి నాయకత్వం ఉండాలని ఉమా స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా ముందుకు సాగాలంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తారని తెలిపారు.
