జిల్లాలో ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోళ్లకు 155 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు – లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం

-జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించి మొత్తం 49,389 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు జరిగిందని.. తద్వారా సుమారు 3,21,030 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉండగా, సుమారు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 155 రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అక్టోబర్ 31 నుంచి ప్రారంభమయ్యాయి.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ధాన్యం కొనుగోలు షెడ్యూల్‌ను వాట్సాప్ ద్వారా ముందుగానే తెలియజేసి, కొనుగోలు విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు.
అలాగే, ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్నీ సంచులు, హమాలీలు, రవాణా వాహనాలను తగినంతగా అందుబాటులో ఉంచాలన్నారు. ఆక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వర్షాల నుండి ధాన్యాన్ని రక్షించేందుకు అవసరమైన ప్రాంతాల్లో తగిన టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎం ఎస్ పీ) లభించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
*డివిజన్ల వారీగా RSKల వివరాలు:*
– తిరువూరు డివిజన్ – 64
– విజయవాడ డివిజన్ – 44
– నందిగామ డివిజన్ – 47
– *మొత్తం – 155

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. రైతులు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ *7702003571* ను సంప్రదించాలని సూచించారు.