-వరుస తుఫాన్లతో వచ్చిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించిన ముఖ్యమంత్రి
-కోస్తాంధ్రలో మౌలిక వసతుల బలోపేతానికి కేంద్రం సహకరించాలి: సీఎం చంద్రబాబు
-రాష్ట్రానికి తక్షణ తుఫాన్ సాయం అవసరం: ముఖ్యమంత్రి
-తుఫాన్ నష్టం తీవ్రంగా ఉందని తమ పరిశీలనలో గమనించామని సీఎంకు తెలిపిన కేంద్ర బృందం
-మురసుతో రాష్ట్రానికి రూ.2,484 కోట్ల నష్టం.. 1.43 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రానికి తక్షణ తుఫాన్ సహాయం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర బృందానికి తెలిపారు. మురసు తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వర్చువల్‌గా సమావేశమైంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో తాము పరిశీలించిన అంశాలను ముఖ్యమంత్రికి వివరించింది. రాష్ట్రంలో ఎల్ నినో, వరుస తుఫాన్ల వల్ల ఎదుర్కొంటున్న పరిస్థితులను సీఎం చంద్రబాబు వివరించగా… తాము క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయాలను కేంద్ర బృందం ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం, ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు, సహాయక కార్యక్రమాలు, పునరుద్ధరణ పనుల గురించి ముఖ్యమంత్రి వివరించారు. వరుస తుఫాన్లతో రైతులు సహా వివిధ రంగాలకు భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణ సాయాన్ని కేంద్రం అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాపడ్డారు. అలాగే తీర ప్రాంతంలో తుఫాన్లకు దెబ్బతినకుండా మౌళిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని… ఈ మేరకు కేంద్రం సహకారం ఇవ్వాలన్నారు. కేంద్ర బృందం కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసింది కాబట్టి… కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో ఇక్కడ జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో వివరించాలని ముఖ్యమంత్రి కోరారు. వీలైనంత త్వరగా నివేదికను సిద్దం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి సూచించారు.
కేంద్ర బృందం పరిశీలనలో కీలక అంశాలు
కేంద్ర బృందం తాము క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను ముఖ్యమంత్రికి వివరించింది. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, విద్యుత్ స్తంభాలకు కూడా భారీ నష్టం వాటిల్లిందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కాలువలు, వాగుల్లో పూడికతీత పనులు చేపట్టడం వల్ల నష్టం చాలావరకు తగ్గిందని అభిప్రాయపడింది. ప్రత్తి వంటి వాణిజ్య పంటలకు బీమా ప్రీమియం అధికంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు బీమా చేయించుకోలేదనే విషయాన్ని గుర్తించినట్టు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు తుఫాన్ కారణంగా దెబ్బతిన్నాయని, బాధిత కుటుంబాలకు 30 రోజుల్లో మూడుసార్లు రేషన్ అందించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ప్రీ-స్కూల్ యూనిఫామ్స్ అందించాలని, తుఫాన్ ప్రభావానికి గురైన గిరిజనులను ప్రత్యేకంగా ఆదుకోవాలని తెలిపింది. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తూ నష్టపోయిన రైతులకు అధిక పరిహారం అందించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. అర్నబ్ తుఫాన్‌తో పోలిస్తే మురసు తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలో వరి పంటకు 80 శాతం, ఏలూరు జిల్లాలో 90 శాతం వరకూ నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఉద్యాన పంటల్లో మామిడి, బొప్పాయి ఎక్కువగా దెబ్బతిన్నాయని వివరించింది.
60 ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం రెండు బృందాలుగా విడిపోయి బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించింది. దాదాపు 60 ప్రాంతాల్లో పంట పొలాలు, కాలువలు, రహదారులు, ఇళ్లు, ఇతర మౌలిక వసతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించింది. బాపట్ల, జమ్మలపాలెం, చీరాల, చిన్నగంజాం, పర్చూరు, నిడమర్రు, ఉంగుటూరు, చిలకలూరిపేట, గౌరీపట్నం తదితర ప్రాంతాల్లో పర్యటించింది. భీమడోలు మండలం సూరప్పగూడెంలో పంట నష్టంపై రైతులతో బృందం నేరుగా మాట్లాడింది. రావులపర్రులో డ్రైనేజీ వ్యవస్థ, వరి పంటలను పరిశీలించింది. కునకలమర్రులో కొమ్ము కాలువ, సాగునీటి వ్యవస్థను తనిఖీ చేసింది. చీరాలలో మత్స్యకారుల పడవలకు జరిగిన నష్టాన్ని, బొప్పూడిలో పక్కా ఇళ్లు, ఉద్యాన పంటలు, వ్యవసాయం, బాతుల పెంపకందారులకు జరిగిన నష్టాన్ని పరిశీలించింది. ఎడ్లపాడు–తుర్లపాడు మధ్య జలాది మీదుగా ఉన్న ఆర్ అండ్ బీ రహదారుల పరిస్థితిని కూడా అంచనా వేసింది.
1,385 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రహదారులు
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక అంచనాల ప్రకారం మురసు తుఫాన్ కారణంగా మొత్తం రూ.2,484 కోట్ల మేర నష్టం సంభవించింది. ఇందులో రహదారులు, వ్యవసాయం, ఉద్యాన పంటలు, విద్యుత్ వ్యవస్థలు, ఇళ్లు, సాగునీటి వనరులతో పాటు పలు ఇతర రంగాలు ఉన్నాయి. తుఫాన్ కారణంగా 1,385 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. వీటివల్ల రూ.888 కోట్ల విలువైన రహదారులకు నష్టం వాటిల్లింది. గ్రామీణ ప్రాంతాల్లో 220 కిలోమీటర్ల మేర 114 రహదారులు దెబ్బతిన్నాయి. వ్యవసాయ రంగంలో 1,43,617 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, రూ.875 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తం 1,86,063 మంది రైతులు ప్రభావితమయ్యారు. ఉద్యాన పంటలకు సంబంధించి 6,756 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, రూ.337 కోట్ల నష్టం సంభవించింది. 12,605 మంది రైతులు నష్టపోయారు. సాగునీటి రంగంలో 369 వనరులు దెబ్బతినగా, 509 చోట్ల గండ్లు పడ్డాయి. విద్యుత్ రంగంలో 10,192 11 కేవీ స్తంభాలు, 6,442 ఎల్టీ స్తంభాలు, 1,448 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అత్యవసర సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.37 కోట్లు ఖర్చుపెట్టింది. తుఫాన్ ప్రభావంతో మొత్తం 3,859 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటితో పాటు వైద్య, ఆరోగ్య శాఖ, మత్స్యశాఖ, పురపాలక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పాఠశాలలు, పశుసంవర్ధక, చేనేత రంగాల్లోనూ నష్టం సంభవించినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి సమర్పించిన నివేదికలో వివరించింది.
