ట్రెండ్ సెట్టర్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
తెలుగు సినీ చరిత్రలో సరికొత్త ఒరవడులు సృష్టించిన నటశేఖరుడు.. యువతకు స్ఫూర్తి, అభిమానులకు ఆరాధ్య దైవం
తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నటుడు, దర్శకుడు, నిర్మాత, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ. తెలుగు చిత్రసీమలో ఎన్నో సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టి, తనదైన నటన, విభిన్న కథాంశాలు, సాహసోపేతమైన చిత్రాలతో సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ట్రెండ్ సెట్టర్ ఆయన. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి నటశేఖరుడిగా, సూపర్ స్టార్‌గా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
ఎన్టీఆర్‌లా పౌరాణిక పాత్రలు, ఏఎన్నార్‌లా సాంఘిక చిత్రాలు, కాంతారావులా జానపద చిత్రాలు, శోభన్‌బాబులా కుటుంబ కథా చిత్రాలకే పరిమితం కాకుండా మాస్ ఓరియెంటెడ్, కౌబాయ్, జేమ్స్‌బాండ్ తరహా చిత్రాలతో యువతను థియేటర్లకు రప్పించిన ఘనత కృష్ణది. తెలుగు తెరపై కొత్త తరహా కథలకు, సాంకేతిక ప్రయోగాలకు ఆయన మార్గదర్శకుడిగా నిలిచారు. ఒకప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 2,500కు పైగా అభిమాన సంఘాలు ఉండేవంటే ఆయనకున్న ప్రజాదరణ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు జన్మించారు. 1964లో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కొత్త నటీనటుల కోసం ఇచ్చిన ప్రకటనకు స్పందించి ఫొటోలు పంపించారు. పలుదశల ఎంపిక అనంతరం ‘తేనె మనసులు’ చిత్రంలో కథానాయకుడిగా అవకాశం దక్కించుకున్నారు. ఆ చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టి తనదైన ప్రయాణాన్ని ప్రారంభించారు.
కృష్ణ నట జీవితంలో కష్టానికి, క్రమశిక్షణకు ప్రత్యేక స్థానం ఉంది. రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ, ఉదయం నుంచి రాత్రి వరకు షూటింగుల్లో పాల్గొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కోసారి నిద్రపోయే సమయంలోనూ కాస్ట్యూమ్స్ ధరించి, నిద్రించే సన్నివేశాలను చిత్రీకరించుకున్న సందర్భాలు ఆయన వృత్తి నిబద్ధతకు నిదర్శనం.
సినిమాల విషయంలో తిరుగులేని రికార్డులు
కృష్ణ సినీ ప్రయాణంలో సినిమాల సంఖ్య ఒక ప్రత్యేక అధ్యాయం. 1968లో ఆయన నటించిన 10 సినిమాలు, 1969లో 19 సినిమాలు, 1970లో 16 సినిమాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 సినిమాలు, 1974లో 13 సినిమాలు విడుదలయ్యాయి. అతి తక్కువ సమయంలో అత్యధిక చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన అరుదైన నటుడిగా గుర్తింపు పొందారు.
తెలుగు తెరకు ఎన్నో సాంకేతిక ప్రయోగాలు
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త సాంకేతికతలను పరిచయం చేయడంలో కృష్ణది ప్రత్యేక స్థానం. ‘గూఢచారి 116’తో జేమ్స్‌బాండ్ తరహా గూఢచారి చిత్రాలకు, ‘మోసగాళ్లకు మోసగాడు’తో కౌబాయ్ జానర్‌కు కొత్త దారులు తెరిచారు. ‘అల్లూరి సీతారామరాజు’తో ఫుల్‌స్కోప్ సాంకేతికతను, ‘సింహాసనం’తో 70 ఎంఎం చిత్ర నిర్మాణాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
అంతేకాకుండా ఆర్.ఓ. సాంకేతికత, ఓఆర్‌డబ్ల్యూ కలర్, ఫ్యూజీ కలర్ వంటి సాంకేతిక ప్రయోగాలకు కూడా ఆయన చిత్రాలు వేదికయ్యాయి. ‘కొల్లేటి కాపురం’, ‘గూడుపుఠాణి’, ‘భలే దొంగలు’ వంటి చిత్రాలు ఈ ప్రయోగాలకు ఉదాహరణలుగా నిలిచాయి. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు.
పద్మాలయా స్టూడియోస్‌తో మరో మైలురాయి
1971లో తన సొంత నిర్మాణ సంస్థ పద్మాలయా పిక్చర్స్ ద్వారా నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ కృష్ణ కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఈ చిత్రం ‘ట్రెజర్ హంట్’ పేరుతో ఆంగ్లంలోకి అనువాదమై 123 దేశాల్లో విడుదలై అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
1983 నవంబర్ 21న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా హైదరాబాద్‌లో పద్మాలయా స్టూడియోస్ ప్రారంభమైంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, స్టూడియో అధినేతగా కూడా కృష్ణ తనదైన ముద్ర వేశారు.
సామాజిక సేవ, రాజకీయ ప్రస్థానం
సినిమాలతో పాటు సామాజిక సేవ, రాజకీయ రంగాల్లోనూ కృష్ణ తనదైన పాత్ర పోషించారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అదే ఏడాది కరువు బాధితుల సహాయార్థం సినిమా తారలు, సాంకేతిక నిపుణులను సమీకరించి విజయవాడ, తెనాలి, గుంటూరు, రాజమండ్రి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి విరాళాలు సేకరించారు.
1984లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణ, 1989లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రజాప్రతినిధిగా కూడా సేవలందించారు.
అవార్డులు, పురస్కారాలతో అరుదైన గౌరవం
కృష్ణ సినీ సేవలకు గుర్తింపుగా అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. 1976లో నటశేఖర బిరుదును అందుకున్నారు. 1997లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2009లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో ఆయనను గౌరవించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం సైతం ఆయన గౌరవార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.
అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా..
ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, పద్మాలయా స్టూడియోస్ అధినేత, మాజీ ఎంపీ, సూపర్ స్టార్ కృష్ణ 2022 నవంబర్ 15న గుండెపోటుకు గురయ్యారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 80 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.
ఆయన భౌతికంగా దూరమైనా తెలుగు సినిమా చరిత్రలో సృష్టించిన రికార్డులు, పరిచయం చేసిన సాంకేతిక ప్రయోగాలు, నటించిన వైవిధ్యమైన పాత్రలు, అభిమానుల హృదయాల్లో సంపాదించుకున్న స్థానం ఎప్పటికీ చెరిగిపోవు. కొత్తదనానికి మారుపేరుగా, సాహసానికి ప్రతీకగా, స్వయంకృషికి నిలువెత్తు నిదర్శనంగా ఘట్టమనేని కృష్ణ తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.