– ఈ నెల 26న 73 గ్రామ పంచాయతీలు, 856 వార్డులకు తొలిదశ ఎన్నికలు
– సజావుగా కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ
– విజయవంతంగా నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గ్రామ పంచాయతీల రెండో సాధారణ ఎన్నికలు-2026లో భాగంగా జిల్లాలో తొలిదశలో ఈ నెల 26న 73 గ్రామ పంచాయతీల్లో 856 వార్డులకు 1,001 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని.. ఇందుకు సంబంధించి ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 26వ తేదీన తొలిదశలో విజయవాడ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి జి.కొండూరు మండలంలో 22 గ్రామ పంచాయతీల్లో 224 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఇదేవిధంగా ఇబ్రహీంపట్నం మండలంలో 10 గ్రామ పంచాయతీల్లో 116 వార్డులకు, మైలవరం మండలంలో 13 గ్రామ పంచాయతీల్లో 154 వార్డులకు, విజయవాడ గ్రామీణ మండలంలో 16 గ్రామ పంచాయతీల్లో 226 వార్డులకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. తిరువూరు రెవెన్యూ డివిజన్ రెడ్డిగూడెం మండలంలో 12 గ్రామ పంచాయతీల్లో 136 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. పోలింగ్ రోజునే ఫలితాల వెల్లడికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు:
పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికార యంత్రాంగం సమన్వయంతో సమగ్ర ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన మౌలిక సదుపాయాలు, పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ర్యాంపులు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించడంతో పాటు, పోలింగ్ సామగ్రి పంపిణీ, రవాణా, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టిసారించామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని.. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు, అక్రమ నగదు, మద్యం పంపిణీ వంటి వాటిపై నిరంతర నిఘా ఉంచుతున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
