-ఘనంగా ధర్తీ ఆబా బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు
-బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజనుల ఆరాధ్య దైవం, ‘ధర్తీ ఆబా’గా ప్రసిద్ధి చెందిన భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలను ఆదివారం విజయవాడలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఇతర గిరిజన నాయకులు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడిగా బిర్సా ముండా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని ఈ సందర్భంగా కొనియాడారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గిరిజన సమాజ అభ్యున్నతి, సామాజిక చైతన్యం కోసం ఆయన అందించిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు.
ప్రధానమంత్రి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం వీక్షణ
అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు, విద్యార్థినులు వీక్షించారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన ఆశయాలు, సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో వి.శ్రీను, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి పి.జ్యోతి లక్ష్మి దేవి, కార్యాలయ సిబ్బంది, వసతి గృహ సంక్షేమ అధికారి డి.ప్రతిభ, కళాశాల విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
