సోనియా గాంధీ ఆత్మకథ ‘Belonging: A Journey of Love’ అందుకున్న ఎన్‌ఎస్‌యూఐ స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్

-గిడుగు రుద్రరాజు చేతుల మీదుగా పుస్తకం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రచించిన ఆత్మకథ ‘Belonging: A Journey of Love’ పుస్తకాన్ని మాజీ శాసనమండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు చేతుల మీదుగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ అందుకున్నారు.
ఈ సందర్భంగా వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సోనియా గాంధీ తన ఆత్మకథలో రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్న అనుభవాలు, జీవితంలో ఎదురైన కష్టనష్టాలు, చేసిన త్యాగాలను వివరించారని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, కుటుంబ సభ్యులను కోల్పోయిన విషాద పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడ్డారని పేర్కొన్నారు. భారతదేశంలో ఉంటూ మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించారని అన్నారు.
రాజీవ్ గాంధీ మరణానంతరం దేశవ్యాప్తంగా ఆమె ప్రధానమంత్రి కావాలని పలువురు కోరినప్పటికీ, ఆ పదవిని స్వీకరించకుండా త్యాగం చేశారని గుర్తుచేశారు. నిస్వార్థ సేవాభావం కలిగిన శక్తివంతమైన మహిళగా సోనియా గాంధీ నిలిచారని కొనియాడారు.
దేశ సమైక్యత, సమగ్రత కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, ఇటలీ నుంచి 19 ఏళ్ల యువతిగా సుమారు ఆరు దశాబ్దాల క్రితం భారతదేశానికి వచ్చిన సోనియా గాంధీ ప్రేమానుబంధంతో ఈ దేశాన్ని తన సొంత దేశంగా స్వీకరించి, అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు.
సోనియా గాంధీ జీవిత ప్రయాణం, రాజకీయ అనుభవాలు, త్యాగాలు, ప్రజాసేవలో ఆమె పోషించిన పాత్రకు ఈ ఆత్మకథ అద్దం పడుతుందని వేముల శ్రీనివాస్ అన్నారు. ఈ పుస్తకం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకురాలి ఆత్మకథను అందుకోవడం ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ పుస్తకాన్ని స్వయంగా అందజేసిన సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజుకు వేముల శ్రీనివాస్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.