-20 వార్డుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల ఖరారు
రామవరప్పాడు, నేటి పత్రిక ప్రజావార్త:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రామవరప్పాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఎన్డీఏ కూటమి తరఫున కొల్ల ఆనంద్ కుమార్ పోటీ చేయనున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అంగీకారంతో సర్పంచ్ అభ్యర్థితో పాటు 20 వార్డులకు చెందిన ఉమ్మడి అభ్యర్థులను ఖరారు చేసినట్లు కూటమి నాయకులు ప్రకటించారు. ఆదివారం రామవరప్పాడులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచనల మేరకు మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని నాయకులు తెలిపారు. గత ఎన్నికల కంటే ఈసారి మెరుగైన మెజారిటీ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ గ్రామ అధ్యక్షుడు కళ్ళేపల్లి నాగరాజు మాట్లాడుతూ మూడు పార్టీల నాయకుల పరస్పర అంగీకారంతో కొల్ల ఆనంద్ కుమార్‌ను సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. 20 వార్డుల్లో టీడీపీకి 9, జనసేనకు 9, బీజేపీకి 2 స్థానాలను కేటాయించినట్లు వివరించారు.
సర్పంచ్ అభ్యర్థి కొల్ల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన మూడు పార్టీల అగ్రనాయకులకు, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా తనతో పాటు 20 మంది వార్డు సభ్యుల ప్యానెల్‌ను గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.
సోమవారం ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల మధ్య సర్పంచ్ అభ్యర్థి కొల్ల ఆనంద్ కుమార్‌తో పాటు 20 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నట్లు నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు నబిగాని కొండయ్య, జనసేన సీనియర్ నాయకులు అడ్డగిరి రామకృష్ణ, బీజేపీ గ్రామ అధ్యక్షుడు కళ్ళేపల్లి నాగరాజుతో పాటు మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
