నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కంపెనీ స్పెసిఫిక్ జాబ్ డ్రైవ్

-నవంబర్ 19న ఎస్ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా
-ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో 18 నుంచి 35 ఏళ్లలోపు యువతీ యువకులకు అవకాశం
-నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం
-అర్హులైన అభ్యర్థులు ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ గురువారం విజయవాడలో కంపెనీ స్పెసిఫిక్ జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు.

ఈ జాబ్ డ్రైవ్ విజయవాడలోని గుణదల ఎస్ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ డిగ్రీ కళాశాలలో ఉదయం 9.00 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హతలు కలిగి, 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు గల యువతీ యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000 నుంచి రూ.30,000 వరకు వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జాబ్ డ్రైవ్‌కు హాజరైన అభ్యర్థులకు సంబంధిత కంపెనీ ప్రతినిధుల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హత, ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు.

ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration వెబ్‌సైట్‌లో తమ పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో రెజ్యూమ్ లేదా బయోడేటాతో పాటు ఆధార్ కార్డు, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్, పాన్ కార్డు, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9032633548 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు పొందాలని కోరారు. ఈ జాబ్ డ్రైవ్ ఏర్పాట్లను జిల్లా ఉపాధి మరియు నైపుణ్య అధికారి సి.మధుభూషణ్ రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.