నిష్ప‌క్ష‌పాతంగా ఎన్నిక‌ల వ్య‌యాల ప‌ర్య‌వేక్ష‌ణ‌

– పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో విధులు నిర్వ‌ర్తించాలి
– ప్ర‌తి అడుగులోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి
– ఎన్నిక‌ల వ్యయ జిల్లా పరిశీలకులు బి. విజయ్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో స్థానిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అభ్య‌ర్థుల వ్యయాల పర్యవేక్షణలో అధికారులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని ఎన్నికల వ్యయ జిల్లా పరిశీలకులు బి.విజయ్ కుమార్ సూచించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిబ‌ద్ధ‌త‌తో విధులు నిర్వర్తిస్తూ, ప్రతి అంశంలోనూ జవాబుదారీతనాన్ని పాటించాలని తెలిపారు.
మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో జిల్లా వ్య‌య ప‌రిశీల‌కులు బి.విజ‌య్ కుమార్.. స‌హాయ వ్య‌య ప‌రిశీల‌కుల‌తో పాటు క‌మాండ్ కంట్రోల్ రూమ్‌, ఎంసీసీ, ఎంసీఎంసీ, అకౌంటింగ్ టీమ్‌, ఎక్సైజ్ త‌దిత‌ర విభాగాలు, శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. వివిధ క‌మిటీల ప‌నితీరును ప‌రిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (ఎస్‌ఎస్‌టీ), వీడియో సర్వైలెన్స్ టీమ్స్ (వీఎస్‌టీ) తదిత‌ర బృందాల మ‌ధ్య స‌మ‌న్వ‌యంపైనా దిశానిర్దేశం చేశారు. ఎన్నికల వ్యయాలకు సంబంధించిన అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, విధుల నిర్వహణలో ప్రతి అడుగులోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స‌రైన ప్రొఫార్మాలో నివేదిక‌ల రూప‌క‌ల్ప‌న‌తో పాటు వాటిని నిర్దేశ స‌మ‌యంలోగా స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, మీడియా ద్వారా ప్రసారమయ్యే ఎన్నికల సంబంధిత ప్రకటనల పర్యవేక్షణ, అభ్యర్థుల వ్యయాల లెక్కల నిర్వహణ విష‌యంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎక్సైజ్ సహా సంబంధిత శాఖల అధికారులు తమ పరిధిలో చేపడుతున్న తనిఖీలు, పర్యవేక్షణ చర్యలను నిరంతరం కొనసాగించాలని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే అక్రమ కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు. ఎన్నికల వ్యయాల పర్యవేక్షణలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా, అందరికీ ఒకే విధమైన నిబంధనలు వర్తించేలా చర్యలు చేపట్టాలని వ్య‌య ప‌రిశీల‌కులు విజ‌య్ కుమార్ తెలిపారు.