-మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో మొబైల్ వాహనాల ద్వారా ధరణి బ్రాండ్ బియ్యం
-బహిరంగ మార్కెట్లో బియ్యం ధరల నియంత్రణపై రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ అసోసియేషన్లతో చర్చలు
-రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి సరఫరాకు నిర్ణయం
-కిలో కందిపప్పు రూ.100, గోధుమ పిండి రూ.25, లీటర్ పామాయిల్ రూ.125
-ఉల్లి ధర మరింత తగ్గించేలా చర్యలు
-నిత్యావసరాల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో సరుకులు అందించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ నిత్యావసర వస్తువుల ధరలను వీలైనంత తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలను నియంత్రించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షంచారు. భవిష్యత్తులో నిత్యావసర వస్తువుల సరఫరా ప్రణాళికలపై చర్చించారు. పౌరసరఫరాల శాఖతో పాటు… వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో ధరల నియంత్రణకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు బియ్యం, కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి వంటి నిత్యావసరాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ధరణి బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్న సూపర్ ఫైన్ బియ్యాన్ని రైతుబజార్లకే పరిమితం చేయకుండా మున్సిపాలిటీలు, మండల కేంద్రాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ధరణి బియ్యాన్ని మొబైల్ వాహనాల ద్వారా ప్రజలకు చేరువ చేయాలని స్పష్టం చేశారు. ఫైన్, సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని కిలో రూ.49, రూ.50కు విక్రయించాలన్నారు. ఇక బహిరంగ మార్కెట్టులో కూడా బియ్యం ధరలను అదుపులో ఉంచేందుకు సీఎం ఆదేశాలతో మిల్లర్లు, హోల్ సేల్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ రకాల బియ్యం ధరలను తగ్గించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి మిల్లర్లు, హోల్ సేల్ అసోసియేషన్ ప్రతినిధులు అంగీకరించినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బీపీటీ రకం స్టీమ్ బియ్యాన్ని కిలో రూ.66కు, సాధారణ రకం స్టీమ్ బియ్యాన్ని కిలో రూ.47కు మించకుండా విక్రయిస్తామని మిల్లర్లు అంగీకరించారని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ధరణి బ్రాండ్ ద్వారా తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యాన్ని అందించడంతో పాటు, ఇతర రకాల బియ్యం ధరలపైనా నియంత్రణ ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా ధాన్యం తరలిపోకుండా అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు, టోల్గేట్ల వద్ద నిఘా పెంచాలని, ధాన్యం, బియ్యంపై మార్కెట్ సెస్సు భారాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
దీపావళి నాటికి రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాలు
కందిపప్పు ధరలను తగ్గించేందుకు తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డుదారులకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నెలకు కిలో కందిపప్పును రూ.100కే అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు కిలో రూ.170 నుంచి రూ.200 వరకు పలుకుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ జోక్యంతో ధరల భారాన్ని తగ్గించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి అవసరమైన సహయాన్ని తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. రేషన్ షాపుల ద్వారా కందిపప్పు సరఫరాకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పామాయిల్ ధరలను తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చెప్పారు. రేషన్ డిపోల ద్వారా లీటరు పామాయిల్‌ను రూ.125కే అందించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. దీని కోసం అవసరమైన పామాయిల్‌ను టెండర్ల ద్వారా సేకరించి సరఫరా చేసే ప్రక్రియ చేపట్టాలన్నారు. ప్రస్తుతం మార్కెట్లో వంటనూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో, ప్రభుత్వ సరఫరా ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగించాలని పేర్కొన్నారు. అదేవిధంగా గోధుమ పిండిని కూడా రేషన్ దుకాణాల ద్వారా కిలో రూ.25కే అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి వంటి నిత్యావసరాలను దీపావళి పండుగ నాటికి రేషన్ షాపుల ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం
ఉల్లి ధరల నియంత్రణపై అధికారులు తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ద్వారా రైతుబజార్లల్లో కిలో రూ.35కే విక్రయిస్తోన్నట్టు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరో 800 మెట్రిక్ టన్నుల ఉల్లిని అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే కాలంలో కర్నూలు ప్రాంతం నుంచి ఉల్లి పంట మార్కెట్లోకి అందుబాటులో వస్తే సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉందని వివరించారు. ఉల్లి ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఉపశమనం కలిగేలా సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని సీఎం సూచించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చోట ప్రభుత్వ జోక్యం ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ధరల నియంత్రణకై తీసుకుంటున్న ఈ చర్యలతో నెలకు సుమారు రూ. 100 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వానికి భారమైనా సరే… ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజలకు నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందేలా సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని, ధరల నియంత్రణ చర్యల ప్రయోజనాలు నేరుగా వినియోగదారులకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కన్నబాబు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
