హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఎగురవేసి తొలిసారి గోల్కొండ కోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని తెలిపారు. ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రజల సామాజిక, ఆర్థిక పునరుజ్జీవనానికి గీటురాయిగా మారింది. స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశం టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అంతరిక్ష, అణుశక్తి కార్యక్రమాల్లో స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించే అతికొద్ది దేశాల సరసన భారతదేశాన్ని ఆనాడే నిలుపగలిగారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ హయాంలో ఈ దేశానికి సాంకేతిక విప్లవాన్ని తీసుకు రాగా… ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మన తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ స్వర్గీయ పీవీ నర్సింహారావు గారు ఆర్థిక విప్లవాన్ని తీసుకువచ్చి భారత దేశ ముఖచిత్రాన్నే మార్చేశారు. ఇట్లా… నెహ్రూ హయాంలో మొదలైన భారత దేశ విజయ ప్రస్థానం ఇందిరా, రాజీవ్, పీవీ హయాంతో ప్రపంచంలో అగ్రదేశాల సరసన చేరే స్థాయికి ఎదిగింది. స్వాతంత్య్ర సాధనతోపాటు కాంగ్రెస్ ఈ దేశానికి అందించిన సేవలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నేటి ప్రజలు, ఈ తరం యువకులు ఈ వాస్తవాలను గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజా పాలన మొదలైంది. మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నాం. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంయమనం పాటిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ, స్ఫూర్తితో పాలన చేస్తున్నామన్నారు. ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ రాసిన ‘‘జయ జయహే తెలంగాణ…’’ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికామన్నారు. తెలంగాణ ప్రజల మనసు నాకు తెలుసు. వారి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యానికి విలువ, గౌరవం పెరుగుతుంది. దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్వస్థత చేకూర్చడం కోసం ఆర్థిక పునరుజ్జీవనం అవసరం అని భావించాం. ఆ దిశగా రాష్ట్ర అప్పులను రీ స్ట్రక్చర్ చేయించే ప్రయత్నంలో ఉన్నాం. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యాం. తక్కువ వడ్డీలతో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై మా మధ్య సానుకూల చర్చలు జరిగాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. గతంలో మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి… రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేని భారం మోపే పనులు మేం చేయబోం. ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయహస్తం హమీలన్నీ తూ.చ తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
Tags hyderabad
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …