– కార్యక్రమం విజయవంతానికి ప్రణాళికాయుత కృషి
– జిల్లా కలెక్టర్ డా. జి సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకూ స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని జిల్లాలో విజయవతంగా నిర్వహించేందుకు ప్రణాళికాయుత కృషి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు.
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమానికి సంబంధించి గురువారం రాష్ట్ర సచివాలయంలో వివిధ సమన్వయ శాఖల కార్యదర్శులతో రాష్ట్ర స్థాయి తొలి స్టీరింగ్ కమిటీ సమావేశం, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిర్వహించారు. ఈ వీసీకి జిల్లా కలెక్టర్ డా. జి.సృజన కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. పరిశుభ్రత ప్రచార కార్యక్రమం ఈనెల 17న ప్రారంభమై 15 రోజుల పాటు గాంధీ జయంతి అక్టోబరు 2వరకూ నిర్వహించాలని.. ఇందుకు సంబంధించి సన్నాహక కార్యక్రమం ఈనెల14 నుండి ప్రారంభమవుతుందని సీఎస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ విస్తృత ప్రజాభాగస్వామ్యంతో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాల ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చేలా చేయనున్నట్లు తెలిపారు. స్పెషల్ డ్రైవ్‌ల ద్వారా కూడా స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.