Breaking News

ఉచిత ఇసుక విధానం అమలుకు పటిష్ట చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఆయన జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉచిత ఇసుక విధానం కచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

రీచ్ ల్లో ఇసుక తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లో జెసిబి, ప్రొక్లైన్ వంటి యంత్రాలను ఉపయోగించడానికి వీలులేదని, కేవలం మనుషులతో (మాన్యువల్) తవ్వకాలు చేపట్టే విధంగా చూడాలన్నారు. ఈ విషయంలో నిబంధనలను ఉల్లంఘించిన వారి యంత్రాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాన్యువల్ పద్ధతిలో ఇసుక తవ్వకాలకు స్థానికులకే అవకాశం కల్పించే విధంగా చూడాలన్నారు. నది కట్టకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు కట్ట నుంచి రెండు వందల మీటర్ల అవతల తవ్వకాలు జరిగే విధంగా చూడాలని, ఇందుకు గ్రామ మండల సర్వేయర్ల సహాయంతో స్థానిక తహసిల్దార్లు ఇసుక తవ్వకాల ప్రాంతాలలో మార్కింగు చేయాలన్నారు. అదేవిధంగా ఒకే ప్రాంతంలో అదే పనిగా నిరంతరంగా ఇసుక తవ్వి భారీ గుంటలు ఏర్పడటానికి అవకాశం లేకుండా చూడాలని సూచించారు.

అవసరం మేరకే ఇసుకను తీసుకెళ్లాలని, అలాకాకుండా వ్యాపార ధోరణితో ట్రాక్టర్లతో ఎక్కడైనా ఇసుకను నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు ఆర్డీవో, ఎంపిడిఒలతో కూడిన డివిజన్, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ బి సత్యనారాయణ, మచిలీపట్నం ,ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ల అధికారులు కే స్వాతి, బీఎస్ హేలా షారోన్, మైన్స్ ఏడి శ్రీనివాసరావు, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ గంగయ్య, డిపిఓ జె అరుణ, డ్వామా పీడీ శివప్రసాద్, భూగర్భ జల, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

వైద్య విద్యలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తెచ్చింది జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ‌మే

-పైగా కూట‌మి ప్ర‌భుత్వంపై బుర‌దజ‌ల్ల‌డం స‌మంజ‌స‌మేనా -రూ. 8540 కోట్ల‌కు గాను 1400 కోట్ల‌ను మాత్ర‌మే ఖ‌ర్చు చేశారు -విధ్వంసాన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *