Breaking News

వక్ఫ్‌ సవరణల బిల్లును వ్యతిరేకించండి

-రేపు బిల్లుకి వ్యతిరేకంగా విజయవాడలో బహిరంగ సభ
-లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్‌ జల్లి విల్సన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వక్ఫ్‌ సవరణలను బిల్లును వ్యతిరేకించాలని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్‌, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఎంబీ విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బతీసే విధంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు సవరణల బిల్లును తీసుకువచ్చిందన్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలతో పాటు ఇతర ఇండియా కూటమి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయని చెప్పారు. ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) కి పంపాలని డిమాండ్‌ చేయటంతో కేంద్రం జేపీసీకి పంపిందన్నారు. మోదీ ప్రభుత్వం ఈ బిల్లును ఈ నెల 29వ తేదిన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లు ఆమోదం పొందకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు ముస్లింలు, తరువాత క్రైస్తవులకు వ్యతిరేకంగా బిల్లును తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసిన తరువాత ఆ రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ఓడిపోయిందన్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా విధాన నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపేందుకు కశ్మీర్‌ గీటురాయి అన్నారు. ముస్లింల స్థితిగతులపై గతంలో రూపొందించిన సచార్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాల్సిన బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రక్కకు తప్పుకుంటుందన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాసిన లౌకిక రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. రాజ్యాంగ లక్ష్యాలను బీజేపీ తుంగలో తొక్కుతుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో వక్ఫ్‌ బోర్డు సవరణల బిల్లును వ్యతిరేకిస్తూ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదిన విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో భారీ నిసరన సభ నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఈ సభ జరుగుతుందన్నారు. ఈ సభకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిలారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, మాజీ పార్లమెంటు సభ్యుడు వడ్డే శోభనాద్రీశ్వరావు, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్‌ కెఎస్‌.లక్ష్మణరావులతో పాటు వివిధ ముస్లిం సంఘాల నాయకులు, ప్రగతిశీలవాదులు తదితరులు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా నిరసన సభ పోస్టర్లు, కపత్రాలు, ఫ్లెక్సీ ఇతర ప్రచార సామాగ్రిని ముస్లిం నేతలతో కలిసి జల్లి విల్సన్‌ ఆవిష్కరించారు. కేంద్ర ప్రవేశపెట్టే వక్ఫ్‌బోర్డు సవరణల బిల్లును వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసన సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ముస్లిం నాయకులు అబ్దుల్‌ మతిన్‌ మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన వక్ఫ్‌ సవరణల బిల్లు లోపభూయిష్టంగా ఉందన్నారు. సచార కమిటీ సిఫార్సుల మేరకు పేద ముస్లింల అభివృద్ధి, సంక్షేమం, వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ కోసం తీసుకువచ్చామని కేంద్రం చెపుతున్న మాటలు శుద్ధ అబద్ధాలని కొట్టిపడేశారు. వక్ఫ్‌ ఆస్తులను వారి అనుయాయులకు అన్యాక్రంతం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. వక్ఫ్‌ బోర్డు సవరణల బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర నాయకులు షేక్‌.బాజి సయ్యద్‌ మాట్లాడుతూ ఎన్టీఏ ప్రభుత్వం దేశంలోని ముస్లింలపై దాడులు చేస్తుందని విమర్శించారు. లౌకికవాదానికి విఘాతం కలిగించేందుకు బీజేపీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలను ఖండిరచారు. ఇండియా కూటమి వ్యతిరేకించిన ఈ బిల్లును జేపీసీ అరకొర మార్పులు చేసి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టబోతుందన్నారు. ఈ బిల్లు ఆమోదిస్తే ముస్లింకు ఏం నష్టం జరుగుతుందో బహిరంగ సభ ద్వారా వివరించనున్నట్లు చెప్పారు. ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ చిస్తీ మాట్లాడుతూ మైనార్టీలపై ఆర్థిక దాడి చేయటానికే వక్ఫ్‌ బిల్లు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు వక్ఫ్‌ సవరణల బిల్లును వ్యతిరేకించాలని, కేరళ తరహాల్లో తీర్మానం చేయాలని కోరారు. ముస్లిం సంఘం నాయకుడు ఎస్‌ఎస్‌.బాబా మాట్లాడుతూ వక్ఫ ఆస్తులను కాజేసి అదాని, అంబానీలకు కట్టబెట్టేందుకు ఈ బిల్లు తీసుకువస్తున్నారని చెప్పారు.
ఈ సమావేశంలో ఇన్సాఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్‌ అప్సర్‌, ముస్లిం సంఘాల రాష్ట్ర నాయకులు నాయకులు ఎస్‌కే.షఫీ, మహబూబ్‌ ఆజం, సయ్యద్‌ సత్తార్‌ ఖాన్‌, ముస్లిం ఐక్యవేదిక ఎన్టీఆర్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే.మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *