గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెలాఖరుకి ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ డ్రైన్ నిర్మాణ పనులు పూర్తి కావాలి..కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని విస్తరణ పనులు జరుగుతున్న ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ డ్రైన్లను ఈ నెలాఖరుకి పూర్తి చేయాలని, కోర్ట్ కేసులు, సమస్యలు లేని ప్రాంతంలో రోడ్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ ఏటి అగ్రహారం రోడ్ విస్తరణ పనులను చుట్టగుంట నుండి కంకరగుంట ఆర్యుబి వరకు పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో, కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏటి అగ్రహారం ప్రధాన రహదారి విస్తరణ పనులు జాప్యం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే అనేక ఫిర్యాదులు, అర్జీలు తమకు అందాయన్నారు. ఈ నెలాఖరు నాటికి డ్రైన్ల నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని ఇంజినీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. కోర్ట్ కేసుల సాకుతో విస్తరణ పనుల్లో జాప్యం సహించబోమని, కేసులు వేసిన వారితో అవసరమైతే నేరుగా తమ దగ్గరకు తీసుకువస్తే వారి సమస్యలు, చట్ట ప్రకారం పరిష్కారంపై తగిన అవగాహన కల్గిస్తామన్నారు. రీచ్ ల వారీగా సమస్యలు లేని ప్రాంతాల్లో రోడ్ నిర్మాణ పనులు కూడా తక్షణం ప్రారంభించాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో నూతన డ్రైన్ నిర్మాణాల ప్రతిపాదనలకు అనుమతులు ఇచ్చామని, క్షేత్రస్థాయిలో ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో పనులు వేగంగా జరిగేలా భాధ్యత తీసుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాల షిఫ్ట్ కి డిడిలు చెల్లించినప్పటికీ షిఫ్ట్ చేయకపోవడంపై సిపిడిసిఎల్ అధికారులపై అసహనం వ్యక్తం చేసి, తక్షణం షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. పనుల్లో సాగాదీత వద్దని, సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రోడ్ల మీద ఆక్రమణలను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.
పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు, డిసిపి సూరజ్ కుమార్, ఏసిపి వెంకటేశ్వరరావు, డిఈఈ మధుసూదన్, ఏఈలు, టిపిఎస్ లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …