– త్వరలో విదేశాల్లోనూ ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు చర్యలు.
– మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఎన్‌డీఏ ప్రభుత్వం కృషి.
– మరుగున పడిన కళలకు జీవం పోస్తున్నాం.
– రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్.సవిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హస్తకళలు, కళాకారులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని.. త్వరలో విదేశాల్లోనూ ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్.సవిత వెల్లడించారు.
శుక్రవారం విజయవాడ, పటమటలోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో లేపాక్షీ గాంధీ శిల్ప బజార్‌ను మంత్రి సవిత.. విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీ హెచ్‌డీసీ) లిమిటెడ్ వీసీ, ఎండీ ఎం.విశ్వ, విజయవాడ ఆర్‌డీవో కె.చైతన్య తదితరులతో కలిసి ప్రారంభించారు. శుక్రవారం నుంచి డిసెంబర్ 1వరకు హస్తకళాభిమానులను అలరించేందుకు దాదాపు 100 స్టాళ్లతో ఏర్పాటుచేసిన గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళాకారులు కళానైపుణ్యంతో తయారుచేసిన వస్తువులను ప్రదర్శన, అమ్మకాలకు అందుబాటులో ఉంచగా.. వాటిని మంత్రి సవిత.. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి తిలకించారు. ఎంబ్రాయిడరీ, గ్రాస్ లీఫ్, ఇమిటేషన్ జువెలరీ, కార్పెట్స్, లెదర్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, టై అండ్ డై చీరలు, ఉడ్ కార్వింగ్, లేస్ బ్యాగులు, డ్రెస్ మెటీరియల్స్, కొండపల్లి బొమ్మలు తదితరాలతో ఏర్పాటు చేసిన స్టాళ్ల ఏర్పాటుదారులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి దిశానిర్దేశం మేరకు మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఎన్‌డీయే ప్రభుత్వం విశేష కృషిచేస్తోందని.. మరుగునపడిన కళలకు జీవం పోస్తోందని పేర్కొన్నారు. హస్తకళలను, చేనేతను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతిఒక్కకరిపైనా ఉందన్నారు. చేయిచేయి కలిపి స్వర్ణాంధ్ర @ 2047 సాధనకు కలిసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. అయిదు నెలల కాలంలోనే మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో మూడు ప్రదర్శనలను ఏర్పాటు చేశామని.. రాష్ట్రంలో లేపాక్షి, ఆప్కో, చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగాయని వివరించారు. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో త్వరలో లేపాక్షి ఎంపోరియంను ఏర్పాటు చేస్తామని.. అదే విధంగా తిరుపతి, విశాఖ తదితర ప్రాంతాల్లోని ఎంపోరియంలను ఆధునికీకరిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్త తయారు కావాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని.. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత తెలిపారు.
కళలను ప్రోత్సహిద్దాం.. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
మన కళలు, సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని వాటిని కాపాడుకుందామని విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. లేపాక్షి గాంధీ శిల్ప బజార్ వంటి ప్రదర్శనలతో హస్తకళలను, చేనేతలకు ఎంతో ప్రోత్సాహం లభిస్తోందని పేర్కొన్నారు. ఉడ్ కార్వింగ్ వస్తువులు, కొండపల్లి బొమ్మలు వంటి కళాత్మక వస్తువులతో పాటు తోలుబొమ్మలాట వంటి ప్రదర్శనలు గాంధీ శిల్ప బజార్‌లో ఎంతో ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం హస్తకళాకారులు, చేనేత కార్మికులకు అన్ని విధాలా తోడుగా నిలుస్తోందని గద్దె రామ్మోహన్ అన్నారు.
ఎగ్జిబిషన్‌ను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలి: లేపాక్షి ఎండీ ఎం.విశ్వ
ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ, ఎండీ ఎం.విశ్వ మాట్లాడుతూ హస్తకళాత్మక వస్తువులను ప్రోత్సహించే లక్ష్యంతో గాంధీ శిల్ప బజార్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హస్తకళలను, చేనేతలను ప్రోత్సహించి, మన కళాత్మాక వైభవాన్ని భావితరాలకు అందించే బృహత్తర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, ఎగ్జిబిషన్ సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో ఆప్కో ఎండీ ఆర్.పవనమూర్తి, చేనేత, జౌళి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.