-వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ ఆగిన పనులు
-తొలి దశ భూ సేకరణ కోసం రూ.93.59 కోట్లు కావాలి
-రికార్డ్ సమయంలో పనుల పూర్తికి సిఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు
-రిజర్వాయర్ ఏర్పాటుతో తీరనున్న తాగు, సాగు, పారిశ్రామిక నీటి అవసరాలు
-పెద్ద ఎత్తున ప్రత్యక్ష , పరోక్ష ఉపాధి అవకాశాలు
-జల వనరుల శాఖా మంత్రి రామానాయుడుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని జిల్లేడుబండ రిజర్వాయర్ (JBR) ప్రాజెక్టు భూ సేకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు. ముదిగుబ్బ, బత్తలపల్లి, ధర్మవరం మండలాల్లో తాగు, సాగునీటిని సరఫరా చేసే ఈ ప్రాజెక్టు కోసం గతంలో ఆగిన పనుల్ని తిరిగి ప్రారంభమయ్యేలా చూడాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు. మొదటి దశ భూ సేకరణ పూర్తి చేసేందుకు రూ.93.59 కోట్ల పెండింగ్ నిధుల్లి విడుదల చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు, మంత్రి నిమ్మల రామానాయుడుకు మంత్రి సత్య కుమార్ యాదవ్ లేఖ రాశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు.
జిల్లేడుబండ రిజర్వాయర్ ప్రాజెక్ట్ కోసం అవసరమైన భూమి 3,378 ఎకరాలు కాగా, అందులో 2,790 ఎకరాల సేకరణ వివిధ దశల్లో ఉందని వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రిజర్వాయర్ భూ సేకరణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని లేఖలో పేర్కొన్న సత్య కుమార్ యాదవ్, ఆగిన పనులను రికార్డు సమయంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ప్రకారం, భూమి సేకరణ, ప్రాజెక్టు నిర్మాణాలు తిరిగి ప్రారంభమయ్యేలా చూడాలని మంత్రి రామానాయుడుకు విజ్ఞప్తి చేశారు. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత కరవు పీడిత ప్రాంతాల్లో ఒకటని గుర్తు చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ తాగు, సాగునీటి అవసరాలు తీరక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లేడుబండ రిజర్వాయర్ ఏర్పాటుతో తాగు, పారిశ్రామిక నీటి అవసరాలు మాత్రమే కాదని, ముదిగుబ్బ, బత్తలపల్లి, ధర్మవరం మండలాల్లోని 23 వేల ఎకరాల ఆయకట్టుకు కూడా నీరు అందుతుందని వివరించారు. జిల్లేడుబండ రిజర్వాయర్‌ను పూర్తి చేయడం ధర్మవరం నియోజకవర్గానికి చిరకాల స్వప్నమని వెల్లడించారు. ఇప్పటికప్పుడు పనులు ప్రారంభించినా లక్ష్యాన్ని చేరుకోవడానికి కనీసం రెండేళ్లు పడుతుందని లేఖలో పేర్కొన్నారు.
జిల్లేడుబండ రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన జరుగుతుంని మంత్రి సత్య కుమార్ యాదవ్ వివరించారు. రిజర్వాయర్ ఏర్పాటు ద్వారా అభివృద్ధి చేసే పారిశ్రామిక హబ్ ఎంతటి కీలకమో వివరించే కొన్ని ప్రధానాంశాల్ని తన లేఖలో ఆయన ఉదహరించారు. జెబిఆర్ ప్రాజెక్టు అనంతపురం-కదిరి-తిరుపతి-చెన్నై హైవేకి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందని వెల్లడించారు. ధర్మవరం-రేణిగుంట సెక్షన్‌లో ఉన్న ముదిగుబ్బ రైల్వే స్టేషన్‌కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు విజయవాడ-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలోని మొలకలవేముల ఇంటర్‌చేంజ్‌కు సమీపంలో ఉందని లేఖలో పేర్కొన్నారు. కదిరి-ముదిగుబ్బ-బత్తలపల్లి ప్రాంతాల మధ్య భారీ బంజరు భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపిన మంత్రి సత్యకుమార్ ఈ ప్రాంతానికి మెరుగైన అనుసంధానత ఉన్నందున పారిశ్రామిక హబ్ అభివృద్ధికి అత్యంత అనుకూలమైనదని తెలిపారు. ప్రతిపాదిత కడప-ముద్దనూరు-ముదిగుబ్బ-బెంగుళూరు రైల్వే లైన్ పనులు ప్రారంభమైతే ఈ ప్రాంతానికి మరింత అనుసంధానత అందుబాటులోకి రావడంతో పాటు బాగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నందున, రిజర్వాయర్ నుంచి నీటిని సరఫరా చేస్తే ఉద్యాన పంటలు పెరిగే అవకాశాలున్నాయని తన లేఖలో మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు. ఇది ప్రజల ఆదాయ మార్గాల్ని, జీవన ప్రమాణాల్ని మెరుగుపరుస్తుందని లేఖలో రాశారు. రిజర్వాయర్‌లో నీటి నిల్వ వల్ల ఈ ప్రాంతంలో ఆక్వాకల్చర్‌కు కూడా ప్రయోజనం చేకూరుతుందని మంత్రి నిమ్మల రామానాయుడుకు రాసిన లేఖలో మంత్రి సత్యకుమార్ వివరించారు.