-దేశ వ్యాప్తంగా జిఐకు ఎంపిక చేసిన ఎనిమిది ఉత్పత్తులలో నరసాపురం లేసుకు స్థానం
-రేపు భౌగోళిక సూచి సర్టిఫికెట్ ను అందుకోనున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భౌగోళిక సూచిక (జిఐ) ఎంపికతో నరసాపురం లేస్ కు అంతర్జాతీయ గుర్తింపు సాధించినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రత్యేక ఉత్పత్తుల ప్రోత్సాహం, మార్కెట్ లింకేజి, బ్రాండింగ్ ప్రమోషన్ లక్ష్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 25న ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. భారతీయ జౌళి పరిశ్రమలో చేతితో నేసిన, చేతితో తయారు చేసిన వస్త్రాలు దేశంలో భౌగోళిక సూచిక నమోదిత ఉత్పత్తుల పట్టికలో అగ్రగామిగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎంపిక చేసిన 8 జౌళి చేతి ఉత్పత్తుల్లో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లేసు కూడా జిఐ గుర్తింపు లభించిందని, జిఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులతో వేలాది మంది నేత కార్మికులు, కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వగలుగుతామని నాగరాణి వివరించారు. స్థిరమైన మార్కెట్ అనుసంధానాన్ని అందించడానికి ఉపకరిస్తుందన్నారు. చేనేత ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ సహకారంతో జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నవంబర్ 25న న్యూఢిల్లీలోని హోటల్ ఒబెరాయ్‌లో ఒక రోజు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోందన్నారు. ఈ వర్క్‌షాప్‌తో పాటు దేశంలో 70 కంటే ఎక్కువ జిఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులు ప్రదర్శించబడతాయని, హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఉంటుందన్నారు. జి.ఐ, పోస్ట్ జిఐ ఇనిషియేటివ్‌లపై చర్చించడం, ఈ ప్రత్యేకమైన ఉత్పత్తుల అభివృద్ధికి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయడం సదస్సు ప్రధాన లక్ష్యం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, ఎగుమతిదారులు, జిఐ అధీకృత వినియోగదారులు, ఈపీసీల ప్రతినిధులు, పౌర సమాజ సంస్థలు, పరిశోధనా సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. “నరసపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్” కు కేంద్ర జౌళి శాఖ నుండి జిఐ సర్టిఫికేట్‌ను అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ గుర్తింపుతో పాటు, రాష్ట్రంలో జిఐ గుర్తింపు పొందిన ఉత్పత్తుల్లో ఒకటిగా నిలవడానికి కారణమైన తయారీదారులకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక అభినందనలు తెలిపారు.