-కేంద్ర ప్రభుత్వ పధకాలు ప్రజలందరకూ తెలిసేలా ప్రచారం చేయాలి
-కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలులో జిల్లా రాష్టానికి ఆదర్శం కావాలి
-పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్
అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ పధకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి జిల్లా రాష్టానికే ఆదర్శంగా నిలవాలని పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 58 సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నదని, వాటి వివరాలు ప్రజలకు తెలిసేలా, వినియోగించుకొనేలా అధికారులు కేత్రస్థాయిలో ప్రచారం చేయాలని పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ తెలిపారు. అనకాపల్లి జిల్లా డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ మరియు మోనిటరింగ్ కమిటీ (దిశా) సమీక్షా సమావేశం పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అద్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిదిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్, జిల్లా ఎస్.పి. తుహిన్ సిన్హా, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షులు హాజరై కేంద్ర పభుత్వ పధకాలు అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డుమా, గ్రామీణాభివృద్ది, హౌసింగు, ఆరోగ్య, స్కిల్ డెవలప్మెంటు, లీడ్ బ్యాంకు, విద్య, జాతీయ రహదారులు తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు.
సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరెైన శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పదకాలు వివరాలు తెలియక, ఎలా ధరఖాస్తుచేసుకోవాలో తెలియక ప్రజలు లబ్ది పొందలేక పోతున్నారన్నారు. పధకాలను ప్రచారం చేయడంలో అధికారులు విఫలమయ్యారని, కావున అధికారులు తమ శాఖల పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పధకాలను గ్రామస్థాయిలో ప్రచారం కల్పించాలని తెలిపారు. చాలా పధకాలకు ఆన్ లైన్ లో ధరఖాస్తుచేసుకోమంటున్నారని, ప్రజలకు అవగాహన ఉండటంలేదని, కావున ప్రతి మండలానికి పధకాలు అమలుకు ఒక అధికారిని నియమించాలని తెలిపారు. మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి పధకాన్ని లబ్దిదారులకు అందించాలని తెలిపారు.
పార్లమెంటు సభ్యులు సి.ఎం.రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 38 శాఖల ద్వారా 58 సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. పధకాలు పూర్తిగా అమలు చేసి, ఎక్కువ మంది లబ్దిదారులకు అందించి అనకాపల్లి జిల్లాను ఆదర్శజిల్లాగా నిలపాలని అధికారులకు తెలిపారు. పారిశ్రామికంగా అనకాపల్లి జిల్లా ప్రత్యేక స్థానం కలిగిఉందన్నారు. పధకాలు గూర్చి అధికారులు ముందుగా అవగాహన కలిగి ఉండాలన్నారు. పధకాలు అమలు, నిధులు మంజూరు గూర్చి ప్రతిపాధనలు అందజేయాలని అధికారులకు తెలిపారు. ప్రతిపాదనలు అందజేస్తే మంజూరుకు చర్యలుతీసుకుంటానని తెలిపారు. అధికారులు నిబద్దతతో పనిచేయాలని, ప్రతి పధకాన్ని ప్రజలకు అందించాలని తెలిపారు.
సమావేశంలో సభ్యులు వివిధ అంశాల గూర్చి చర్చిస్తూ
-రోడ్డు సదుపాయం లేని ప్రతి గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలన్నారు.
-నాన్ షెడ్యూలు ఏరియాలో గల గిరిజనులకు కూడా షెడ్యూలు ఏరియాలో వారికి అందజేసే పధకాలు, ప్రయోజనాలు అందేజేసేలా చర్యలకు ప్రతిపాదనలు చేయాలని తెలిపారు.
-20 సంవత్సరాల క్రితం వేసిన సిమెంటు రోడ్లు పాడయినాయని, వాటి స్థానంలో కొత్త రోడ్లు మంజూరుకు ప్రతిపాదనలు చేయాలని కోరారు.
-ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టాలి అందుకుగాను మండలం నుండి ప్రతి గ్రామంలో కావలసిన మౌళిక సదుపాయాలు ప్రతి పాదనలు పార్లమెంటు సభ్యులకు అందించాలి.
-అన్ని గ్రామాలలో అంగన్ వాడి కేంద్రాలు నిర్మాణం చేపట్టాలి
-ప్రతి పాఠశాలకు ప్రహారీ నిర్మించాలి
-స్కిల్ డెవలప్మెంటు కు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు వివరాలు శాసనసభ్యులకుతెలియజేయాలి. ప్రతి నియోజకవర్గంనుండి 200 మందికి శిక్షణ యివ్వాలి.
-పట్టణ, గ్రామీణంలో మంజూరైన గృహాలు, హౌసింగుకాలనీలలో విచారణ చేపట్టాలి. అనర్హులను తొలగించి, అర్హులకు మంజూరు చేయాలి.
-ఆయుష్మాన్ భారత్ పధకం పై ప్రచారం చేయాలి. ఆరోగ్యకార్డులు ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలి
-అనకాపల్లిలో మార్చినాటికి డయాలసిస్ సెంటరు ఏర్పాటుకు చర్యలు
-కిడ్నీ వ్యాదిగ్రస్తులు గల గ్రామాలలో అందుకుగల కారణాలను తెలుసుకోవాలి. నీటి పరీక్షలు నిర్వహించాలి. అవసరమైన ప్రతి గ్రామంలో మంచినీటిశుద్ది పధకం ఏర్పాటుకు పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ హామీ
-కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర, ఎన్ ఎన్ ఎం పధకాల ద్వారా వ్యాపారాలు చేసుకొనుటకు, యూనిట్ల ఏర్పాటుకు లక్ష మంది లబ్దిదారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి
-ప్రతి నియోజకవర్గంలో యూనిట్ల ఏర్పాటుకు లీడ్ బ్యాంగు ద్వారా అవగాహనా కార్యక్రమాలు నిర్వహణ
-జిల్లాలో పాడయిన 182 స్కూలు భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలి
-స్కూలు భవనాల రిపేర్లకు ప్రతిపాదనలు అందించాలి
-అనకాపల్లి- అగనంపూడి రోడ్లు పనులు వెంటనే పూర్తిచేయాలని పార్లమెంటు సభ్యులు తెలిపారు
-ఫ్లై ఓవర్ల నిర్మాణానికి డిపిఆర్ లు సమర్పించాలి
-అవసరం ఉన్న ప్రతి దివ్యాంగునికి ఉపరకణాలు అందించాలి. దివ్యాంగుల లబ్దిదారులు ఎంపిక, ఉపకరణాల పంపిణీపై పరిమితిలేదు.
-దొంగ సర్టిఫికెట్లపై దివ్యాంగుల పెన్షను తీసుకుంటున్న వారిపైన, సర్టిఫికెట్లు మంజూరు చేసిన డాక్టర్లపైన చర్యలు తీసుకోవాలి.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ జె. సుభద్ర, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ మరియు మౌళిక సదుపాయాల అభివృద్ది కార్పొరేషను చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, చోడవరం శాసనసభ్యులు కె.ఎస్.ఎన్.రాజు, యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయకుమార్, మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.