-ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి
-క్షతగాత్రులకు ప్రభుత్వం తరఫున మెరుగైన చికిత్స అందిస్తున్నాం
-భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం
-రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్.సవిత
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు – ఆటో ఢీకొన్న ప్రమాద ఘటన చాలా బాధాకరమని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు.
శనివారం రాత్రి అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రిలో గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు – ఆటో ఢీకొన్న ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అనంతరం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాలను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా ఎస్పీ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సు లారీని ఓవర్టేక్ చేస్తూ ఆటోని డీ కొట్టడంతో ప్రమాదం జరిగి ఏడు మంది చనిపోవడం దిగ్భ్రాంతికరం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగిందన్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అప్రమత్తమై బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని, ప్రభుత్వం తరఫున ఆసుపత్రిలో ఐదు మందికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలిచ్చామన్నారు. ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం తరఫున మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కేశవ నాయుడు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఇన్చార్జి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఆత్మారాం, సిఐ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.